https://oktelugu.com/

Byjus Crisis: ఫేస్ బుక్ జూకర్ బర్గ్ .. బైజూస్ లో పెట్టుబడులు ఎందుకు వెనక్కి తీసుకున్నాడు? అంత ఫ్రాడ్ జరిగిందా?

బైజూస్ రాత్రికి రాత్రే ఏర్పడిన సంస్థ కాదు. 2006లో క్యాట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఎంబీఏ అభ్యర్థులకు రవీంద్రన్ అప్పట్లో తరగతులు ప్రారంభించాడు. ఆ తర్వాత దానిని క్రమక్రమంగా విస్తరించి ఎడ్ టెక్ సంస్థ లాగా మార్చాడు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 23, 2024 / 07:58 AM IST

    Byjus Crisis

    Follow us on

    Byjus Crisis: కర్ణుడి చావుకు కారణాలు అనేకం అనే నానుడిని నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో వాడుతూనే ఉంటాం. ఇప్పుడు బైజూస్ రవీంద్రన్ ఉదంతానికి అదే నానుడి వాడాల్సి ఉంటుందేమో. ఎందుకంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ సంస్థ.. ఎదిగినంత వేగంగానే కిందకి పడిపోయింది. వందలాది మంది ఉద్యోగులతో అలరారిన ఈ సంస్థ జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారింది. వందల కోట్ల టర్నోవర్ చూసిన ఈ సంస్థ.. పది కోట్ల అప్పు కోసం అమెరికా కోర్టుల చుట్టూ తిరుగుతోంది. 2006లో కేరళ రాష్ట్రంలో ఉన్నత విద్యావంతుడు మదిలో మిగిలిన ఆలోచనకు వాస్తవ రూపంగా ఏర్పడిన బైజూస్ అనే సంస్థ.. ఎంతో ఎత్తుకు ఎదిగి.. ఇలా పడిపోవడం నిజంగా స్వయంకృతాపరాధం.

    బైజూస్ రాత్రికి రాత్రే ఏర్పడిన సంస్థ కాదు. 2006లో క్యాట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఎంబీఏ అభ్యర్థులకు రవీంద్రన్ అప్పట్లో తరగతులు ప్రారంభించాడు. ఆ తర్వాత దానిని క్రమక్రమంగా విస్తరించి ఎడ్ టెక్ సంస్థ లాగా మార్చాడు. అనంతరం అండర్ గ్రాడ్యుయేట్, పాఠశాల విద్యార్థుల వరకు తన సంస్థ ఆధ్వర్యంలో పాఠాలు బోధించడం మొదలుపెట్టాడు. స్మార్ట్ ఫోన్ యుగం మొదలైన తర్వాత 2015లో రవీంద్రన్ బైజూస్ పేరుతో లెర్నింగ్ యాప్ ప్రారంభించాడు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు అంటే 2019లో ఎడ్ టెక్ యూని కార్న్ గా మార్చాడు. మరుసటి సంవత్సరం కోవిడ్ విజృంభించిన నేపథ్యంలో పాఠశాల బోధన ఆన్ లైన్ లోకి మారింది. ఫలితంగా బైజూస్ నెట్వర్క్ వేగంగా విస్తరించింది.

    కోవిడ్ మహమ్మారి ప్రబలిన రెండు సంవత్సరాలు కూడా బై జూస్ అపరిమితమైన వృద్ధిని నమోదు చేసింది. అప్పట్లో విదేశీ సంస్థలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టడంతో బైజూస్ క్యాపిటల్ వేల్యూ అమాంతం పెరిగింది. భారత క్రికెట్ జట్టు కు స్పాన్సర్ గా బైజూస్ వ్యవహరించింది. ఫుట్ బాల్ ప్రపంచ కప్ కు స్పాన్సర్ చేసింది. ఫుట్ బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.. అయితే వీటి కోసం రవీంద్ర వృధాగా ఖర్చు చేశాడని అప్పట్లో వాటాదారులు ఆరోపించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ ఆ వివాదం ముగిసిపోయింది.

    కోవిడ్ సమయంలో విపరీతంగా ఆదాయాన్ని నమోదు చేసిన బై జూస్.. కోవిడ్ తగ్గిపోవడంతో విలువ పడిపోవడం మొదలైంది. గత సంవత్సరం ప్రోసస్ అనే సంస్థ బైజూస్ విలువను 75 శాతం తగ్గించింది. ఆదాయం తగ్గిపోవడంతో పలు ప్రాంతాల్లో నెలకొల్పిన తన కార్యాలయాలను బైజూస్ తొలగించింది.. ఖర్చుల కోతల భాగంగా ఉద్యోగులను అడ్డగోలుగా పక్కన పెట్టింది. అయినప్పటికీ ఖర్చులు తగ్గకపోవడంతో రెండు కార్యాలయాలను మాత్రమే ఉంచుకొని మిగతా అన్నింటినీ మూసేసింది. దీనికి తోడు ఉన్న ఉద్యోగులపై అధిక పని గంటల భారం మోపింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంది. అయినప్పటికీ బైజూస్ ఆర్థిక పరిస్థితి గాడిన పడలేదు. చివరికి రవీంద్రన్ 9,362 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని ఎన్ ఫోర్స్ మెంట్ అభియోగాలు మోపిన నేపథ్యంలో ఇన్ని రోజులు బైజూస్ లో ఏం జరిగి ఉంటుందనేది ఇట్టే అవగతమవుతోంది. చివరికి బైజూస్ లో పెట్టుబడి పెట్టిన ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్, అతడి భార్య ప్రిస్పిల్లా చాన్ ఏడాది తిరగకముందే బయటకు వెళ్లిపోయారంటే ఆ కంపెనీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రవీంద్రన్ అక్రమంగా జరిపిన లావాదేవీలను ఈడీ అధికారులు బయటకు లాగుతారా? రవీంద్రన్ తోపాటు ఈ వ్యవహారంలో ఉన్న వారందరిపై చర్యలు తీసుకుంటారా? అనేవి ఇప్పుడు సమాధానం లభించాల్సిన ప్రశ్నలు.