https://oktelugu.com/

Corporate Job: వారంలో ఐదు రోజుల పని.. ఐదంకెల జీతమని గొప్పలు పోతారు గాని.. కార్పొరేట్ కొలువంటేనే నరకం

వారంలో ఐదు రోజుల పని.. ఐదు అంకెల జీతం.. విలాసవంతమైన ఆఫీస్.. అలసటగా ఉంటే సేద తీరొచ్చు. తలనొప్పిగా ఉంటే కాఫీ తాగొచ్చు. ఆకలిగా ఉంటే క్యాంటీన్లో తినొచ్చు.. చెమట అనేది చిందించకుండా పనిచేయవచ్చు.. కార్పొరేట్ కొలువంటే చాలామందికి ఇదే అభిప్రాయం ఉంటుంది. బయట ఉండే అభిప్రాయం వేరు.. లోపల ఉండే పనితీరు వేరు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 20, 2024 / 04:50 PM IST

    Corporate Job

    Follow us on

    Corporate Job: కార్పొరేట్ అంటే భారీగా జీతాలు ఉంటాయి.. అద్భుతమైన భత్యాలు ఉంటాయి.. క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి బ్యాంకులు పోటీ పడతాయి. రుణాలు ఇవ్వడానికి సంస్థలు వెంటపడతాయనే అభిప్రాయం నూటికి 99 శాతం మందిలో ఉంటుంది. కానీ మేడిపండు సామెత లాగే కార్పొరేట్ కొలువు ఉంటుంది. ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఎన్నాళ్లు కంపెనీ సాగుతుందో తెలియదు. ఒకవేళ కంపెనీ చరిత్ర బాగున్నప్పటికీ.. పై భాస్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. కోవిడ్ సమయం నుంచి కార్పొరేట్ కొలువులపై చాలామందికి భ్రమలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఇక తాజాగా జరుగుతున్న సంఘటన మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఎర్నెస్ట్ & యంగ్ అనే కన్సల్టెంట్ కంపెనీలో పని చేసే 26 సంవత్సరాల అన్నా సెబాస్టియన్ కనుమూసింది. పని ఒత్తిడి వల్ల ఆమె తన తనువును చాలించింది. ఈ విషయం బయటకు రావడంతో ఎర్నెస్ట్ యంగ్ కంపెనీ స్పందించక తప్పలేదు. తమ కార్యాలయంలో పని ఒత్తిడి అంతగా ఉండదని.. సెబాస్టియన్ మరణానికి కారణం వేరే ఉంటుందని బుకాయించింది. కానీ ఇదే సమయంలో డెలాయిట్ కంపెనీలో పని చేసే మాజీ ఉద్యోగి దేశంలో కార్పొరేట్ రంగంలో ఎలాంటి సంస్కృతి ఉంటుందో బయట పెట్టాడు. అత్యంత విషపూరితమైన పని కార్పొరేట్ కంపెనీలలో ఉంటుందని అతడు తన బాధను వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి తన అనుభవాలను ట్విట్టర్ ఎక్స్ లో షేర్ చేశాడు.

    ఇంతకీ ఏమైందంటే..

    మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన అనే వ్యక్తి డెలాయిట్ కంపెనీలో పని చేసేవాడు. అతడు ఎన్ని గంటలు పనిచేసినా.. ఇంకా పని ఉండేది. ఒక్కోసారి 20 గంటలు పనిచేసినా.. 15 గంటలు మాత్రమే పని చేశారని లాగిన్ లో ఉండేది. ఇది జయేష్ కు ఇబ్బంది కలిగించింది. అలా పని ఒత్తిడి పెరిగిపోయి అతడి ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో అతడు ఆ కంపెనీ నుంచి బయటికి వచ్చాడు. సెబాస్టియన్ ఉదంతం తర్వాత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి కొన్ని వాట్స్అప్ స్క్రీన్ షాట్ లు కూడా ట్విట్టర్ ఎక్స్ లో షేర్ చేశాడు. ” అన్నా సెబాస్టియన్ దారుణమైన పని అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. నేను కూడా డెలాయిట్ అనే కార్పొరేట్ కంపెనీలో పనిచేశాను. తెల్లవారుజామున 5 గంటలకే నా పని మొదలయ్యేది. దానివల్ల నాకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. రోజులో 20 గంటలు పని చేయాల్సి వచ్చేది. అన్ని గంటలు పనిచేసినప్పటికీ 15 గంటలకు మించి పని చేసినట్టుగా ఉండేది కాదు. లాగిన్ కూడా చిత్ర విచిత్రంగా ఉండేది. ఉద్యోగులు ఒకటి గుర్తుంచుకోవాలి.. మీరు కార్పొరేట్ కంపెనీలకు కేవలం పనిచేసే బానిస మాత్రమే. మీ కుటుంబాలకు మాత్రం మీరే సర్వస్వం. కార్పొరేట్ ఉద్యోగంలో అన్ని బాగున్నట్టు కనిపిస్తాయి. మనం కోల్పోవడం మొదలు పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనిపించదు. అందువల్లే కార్పొరేట్ కంపెనీ అంటేనే విషవలయం. దాని నుంచి ఎంత దూరంగా వెళ్లిపోతే అంత మంచిది. అదృష్టవశాత్తు నేను తొందరగానే మేల్కొన్నాను. కార్పొరేట్ దుష్ట కౌగిలి నుంచి దూరంగా వచ్చాను. ప్రస్తుతం మానసిక ప్రశాంతతను పొందుతున్నాను. శారీరక స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. స్థూలంగా చెప్పాలంటే నాలాగా నేను బతుకుతున్నానని” జయేష్ జైన్ వ్యాఖ్యానించాడు. ట్విట్టర్ ఎక్స్ లో నాడు తాను ఎదుర్కొన్న సమస్యలను స్నేహితులతో వాట్స్అప్ ద్వారా జయేష్ పంచుకున్నాడు. వాటి స్క్రీన్ షాట్లు కూడా తన ట్వీట్ కు జయేష్ జత చేశాడు. ప్రస్తుతం అతడి ట్వీట్ ట్విట్టర్లో ట్రెండింగ్లో కొనసాగుతోంది.