Electric Vehicles : మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడం నుంచి ఆదాయపు పన్నులో రాయితీలు కల్పించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇప్పుడు నిజంగా కనిపిస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతుండడంతో పెట్రోల్, డీజిల్ డిమాండ్‌పై స్పష్టమైన ప్రభావం కనిపిస్తోంది. SBI సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం, దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం వేగంగా క్షీణిస్తోంది. ఫిబ్రవరి 2025లో పెట్రోల్ వినియోగం గత 12 నెలల కనిష్ట స్థాయికి చేరుకోగా, డీజిల్ వినియోగం 5 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.
Also Read : ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో టాటా దూకుడు! హారియర్ ఈవీతో సరికొత్త సవాల్!
ఎంత పెట్రోల్, డీజిల్ వినియోగించారంటే..
నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 2025లో దేశంలో 31 లక్షల టన్నుల పెట్రోల్ వినియోగం జరిగింది. అయితే డీజిల్ వినియోగం 71 లక్షల టన్నులుగా నమోదైంది. జనవరి 2025 డేటాతో పోల్చి చూస్తే, ఫిబ్రవరిలో పెట్రోల్ వినియోగం 5.4 శాతం తగ్గింది. అదేవిధంగా డీజిల్ వినియోగం 5.1 శాతం తగ్గింది. అయితే, గతేడాది ఫిబ్రవరి డేటాతో పోలిస్తే పెట్రోల్ వినియోగం 3.5 శాతం పెరిగింది, కానీ డీజిల్ వినియోగంలో 1.2 శాతం క్షీణత కనిపించింది.
పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఎందుకు తగ్గుతోంది?
దేశంలో CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరగడమే పెట్రోల్ డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం. 2024లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మరోవైపు, డీజిల్ ప్రధానంగా రవాణా రంగంలో ఉపయోగిస్తున్నారు. ఈ రంగంలో తేలికపాటి మోటారు వాహనాల (LMV) విభాగంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారారు. దీనివల్ల డీజిల్ డిమాండ్‌లో తగ్గుదల వచ్చింది. అలాగే, ట్రక్కులు, బస్సుల విభాగంలో కూడా ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధనాలు CNG, LNG మొదలైన వాటి వినియోగం పెరుగుతోంది. రైల్వే డీజిల్ వినియోగం కూడా తగ్గింది.
కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి మాట్లాడుతూ, భారతదేశం ఇప్పటికీ ప్రతేడాది తన అవసరాల కోసం ఎక్కువ శాతం పెట్రోలియాన్ని దిగుమతి చేసుకోవలసి వస్తోందని అన్నారు. పెట్రోలియం కోసం దిగుమతులపై మన ఆధారపడటం 87 శాతానికి పైగా పెరిగిందని ఆయన తెలిపారు.