Ola CEO Bhavish Agarwal: పెద్దపెద్ద నగరాలలో క్యాబ్ సర్వీస్ లు నిర్వహిస్తూ.. వందల కోట్ల వ్యాపారం చేస్తోంది ఓలా అనే సంస్థ. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా తయారుచేస్తోంది. ఈ సంస్థ తయారు చేసే వాహనాలపై ఆరోపణలు కూడా ఉన్నాయి. నాణ్యమైన వాహనాలు తయారు చేయడం లేదనే విమర్శలున్నాయి. ఇవి ఎలా ఉన్నప్పటికీ ఓలా సంస్థ క్యాబ్ సర్వీస్ లో దూసుకుపోతూనే ఉంది. పోటీగా ఉబర్, రాపిడ్ వంటి సంస్థలు వచ్చినప్పటికీ ఓలా కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు..
ఓలా కు మొదట్లో మంచి పేరు ఉండేది. ఈ సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ ను ఔత్సాహిక పెట్టుబడుదారు అని మీడియా ప్రముఖంగా ప్రస్తావించేది. అతను కూడా ఓలా ద్వారా వచ్చిన లాభాలను వివిధ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టాడు. అవన్నీ కూడా భారీగానే లాభాలు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే భవిష్ అగర్వాల్ ఇప్పుడు ఒక్కసారిగా జాతీయ మీడియాలో వార్త అయ్యారు. అయితే ఈసారి ఆయన గురించి వస్తున్న వార్తలన్నీ పాజిటివిటీ కోణాల్లో కాదు.. పూర్తిగా విరుద్ధమైన కోణంలో వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో భవిష్ అగర్వాల్ మీద విపరీతంగా చర్చి జరుగుతోంది.
ఓలా కంపెనీకి ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే సంస్థలు ఉన్నాయి. మనదేశంలో ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు నగరంలో ఓలా సంస్థకు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే కేంద్రాలు ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలలో అరవింద్ అనే ఇంజనీర్ పనిచేస్తున్నాడు. అరవింద్ ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత నెల 28న అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతడి గదిలో మరణ లేఖ కనిపించింది. విచారణలో భాగంగా పోలీసులు దానిని అతని గదిలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఓలా సీఈవో భవిష్ అగర్వాల్, సీనియర్ ఉద్యోగి సుభ్రత కుమార్ వేధిస్తున్నారని.. జీతాలు కూడా ఇవ్వడం లేదని అందులో పేర్కొన్నారు.
అరవింద్ చనిపోయిన తర్వాత రెండు రోజులకు అతడి ఖాతాలో దాదాపు 17.46 లక్షలు జమయ్యాయి. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అరవింద్ చనిపోయిన తర్వాత అతని ఖాతాలో నగదు నమోదు కావడం పట్ల కుటుంబ సభ్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిని బట్టి ఓలా మేనేజ్మెంట్ జీతాలు ఇవ్వడం లేదనేది రూడీ అయిందని.. దీని ఆధారంగా కంపెనీ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే కీలకమైన ఆధారాలను పోలీసులు సేకరించిన నేపథ్యంలో ఓలా యజమానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు.. ఏ విధంగా అడుగులు వేస్తారు అనేది తెలియాల్సి ఉంది.