Car Price Hike : మనదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి దేశంలోని అనేక చట్టాలు, పన్ను వ్యవస్థ మొదలైన వాటిలో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. దీనితో పాటు, రేపటి నుంచి దేశంలో విక్రయించబడే దాదాపు అన్ని కార్ల ధరలు కూడా పెరగబోతున్నాయి. మారుతి ఆల్టో నుంచి మహీంద్రా థార్ వరకు ఏ కంపెనీ కార్ల ధరలు ఎంత పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ధరల పెంపుతో షాక్ ఇవ్వనున్న మారుతి
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా రేపటి నుంచి భారీ షాక్ ఇవ్వనుంది. అన్ని కంపెనీలలోకెల్లా అత్యధికంగా ధరలను పెంచింది మారుతినే. మారుతి కార్ల ధరలు రేపటి నుంచి 4 శాతం వరకు పెరుగుతాయి. ఈ విధంగా మారుతి ఫ్రాంక్స్ బేస్ ధరలోనే రూ.30,000 నుంచి.. మారుతి వ్యాగన్ఆర్ బేస్ ధరలో రూ.22,000 కంటే ఎక్కువ పెరుగుదల ఉంటుంది.
మారుతి బాటలోనే హ్యుందాయ్ కూడా
దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ధరలు పెంచడంలో మారుతితో పోటీ పడుతుంది. ఈ కంపెనీ కార్ల ధరలు రేపటి నుంచి 3 శాతం పెరుగుతాయి. దీనితో హ్యుందాయ్ ప్రజాదరణ పొందిన కారు హ్యుందాయ్ క్రెటా ధర రూ. 33,000 కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది.
పెరగనున్న టాటా-మహీంద్రా SUVల ధరలు
SUV సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా రేపటి నుంచి తమ కార్ల ధరలను 3 శాతం వరకు పెంచబోతున్నాయి. దీనితో టాటా మోటార్స్ అత్యంత ప్రజాదరణ పొందిన టాటా నెక్సాన్ బేస్ ధరలో రూ.23,000 కంటే ఎక్కువ, మహీంద్రా థార్ ధరలో రూ. 33,000 కంటే ఎక్కువ పెరుగుదల చూడవచ్చు.
పెరగనున్న మరికొన్ని కార్ల ధరలు
దేశంలోని ఈ టాప్-సెల్లింగ్ కార్ల కంపెనీలతో పాటు కియా ఇండియా కార్ల ధరలు కూడా రేపటి నుంచి 3 శాతం పెరుగుతాయి. అయితే BMW కార్ల ధరలు 3 శాతం వరకు, ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు ఒక శాతం నుంచి నాలుగు శాతం వరకు, స్కోడా ఆటో కార్ల ధరలు 3 శాతం వరకు పెరుగుతాయి. మరోవైపు హోండా కూడా కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది, అయితే మెర్సిడెస్ కార్ల ధరలు రూ. 2 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. తమ ఉత్పత్తి వ్యయం పెరిగిందని, కాబట్టి దానిలో కొంత భారాన్ని ధరలు పెంచడం ద్వారా వినియోగదారులపై వేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి