Rakesh Jhunjhunwala Passes Away: చదువుకునే వయసులో ఎవరైనా స్టాక్ మార్కెట్ గురించి ఆలోచిస్తారా? కేవలం 5000 తో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించి 10,200 కోట్ల నికర సంపదకు ఎదగడం సాధ్యమేనా? ఎక్కడో రాజస్థాన్లో జన్మించిన ఒక వ్యక్తి ఇండియా దలాల్ పథ్ ను శాసిస్తారని ఎవరైనా అనుకుంటారా? ఇవన్నీ ఆచరణలో సాధ్యం కాని ప్రశ్నలు.. కానీ వీటన్నింటినీ సుసాధ్యం చేసినవాడు రాకేష్ ఝన్ ఝన్ వాలా. ఇండియన్ వారెన్ బఫెట్ గా ప్రఖ్యాతిగాంచిన ఆయన.. ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 62 ఏళ్లు.
-తండ్రి ఆదాయపు పన్ను శాఖలో కమిషనర్
రాకేష్ తండ్రి ఆదాయపు పన్ను శాఖలో కమిషనర్. 1960లో రాజస్థాన్లో జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు రాకేష్ చిన్నతనంలోనే పెట్టుబడులు, లాభాల గురించి బాగా ఆలోచించేవారు. తండ్రి సైన్స్ చదవమని కోరితే తనకు అది ఇష్టం లేదని, కామర్స్ చదివి సిఏ పూర్తి చేశారు. విద్యార్థిగా ఉన్న దశలోనే, దేశంలో స్టాక్ మార్కెట్ అంటే ఎక్కువ మందికి తెలియని రోజుల్లోనే 5000 తో ఒక కంపెనీ షేర్లు కొనడం ప్రారంభించారు. అప్పటినుంచి తను అనారోగ్యానికి గురయ్యేంత వరకు వివిధ కంపెనీలో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. 5000 తో మొదలైన ఆయన ప్రస్థానం నేడు వేల కోట్ల డాలర్లకు చేరుకుంది.
Also Read: Victory Venkatesh: విక్టరీ వెంకటేశ్ @ 36 ఇయర్స్ ఇండస్ట్రీ.. వెంకీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు !
-భార్య పేరుతో కంపెనీ ఏర్పాటు
రాకేష్ తన భార్య రేఖ, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు సంతానం. రాకేష్ తన సతీమణి రేఖ పేరులోని మొదటి అక్షరం కలిసి వచ్చేలా రేర్ అనే కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ ద్వారా వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఆయనకు టైటాన్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, మెట్రో బ్రాండ్స్, ఖాన్ కార్డు బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లో భారీగానే వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్న నికర నగదు నిల్వలనిష్పత్తి ప్రకారం దేశంలోనే 36వ అతిపెద్ద ధనవంతుడు. రాకేష్ కేవలం పెట్టుబడిదారు మాత్రమే కాదు. హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్గా ఉన్నారు. ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్, బిల్ కేర్ లిమిటెడ్, ఫ్రజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రోవోగ్ ఇండియా లిమిటెడ్, ఇన్నోవా సిన్త్ టెక్నాలజీస్ లిమిటెడ్, మిడ్ డే మల్టీమీడియా లిమిటెడ్, నాగార్జున కన్స్ట్రక్షన్ లిమిటెడ్, మీ సెర్చ్ వంటి అనేక సంస్థల్లో ఆయన డైరెక్టర్ గా ఉన్నారు.
-వివాదాలూ ఉన్నాయి
పెట్టుబడిదారు అయిన రాకేష్ పై పలు వివాదాలు కూడా ఉన్నాయి. ఆప్టెక్ కంపెనీకి చైర్మన్గా ఉన్న సమయంలో ఆ కంపెనీకి సంబంధించిన షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈ ఏడాది జూలైలో రాకేష్, ఆయన భార్య రేఖ మరో ఎనిమిది మంది 37 కోట్లకు పైగా జరిమానా చెల్లించారు. గతంలో రిలయన్స్ కంపెనీ విద్యుత్ రంగాల్లోకి ప్రవేశించినప్పుడు ఆ సంస్థకు చెందిన షేర్ల విలువలు పెంచేందుకు ఇన్సైడ్ ట్రేడింగ్ కి పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. అ ఎన్ని ఆరోపణలు ఉన్నా రాకేష్ పట్టిందల్లా బంగారమే అయింది. అదే ఆయనను ఇండియన్ వారెన్ బఫెట్ ను చేసింది. ప్రస్తుతం ఆయన కన్నుమూయడంతో దలాల్ పథ్ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది.
-‘ఆకాశ’ ఫస్ట్ విమానం ఎగిరిన వారానికే మృతి
రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఈనెల 7న ‘ఆకాశ ఎయిర్’ పేరుతో ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన పెట్టుబడిదారుడిగానే కాదు.. ఆకాశ ఎయిర్ లైన్స్ స్థాపించిన వారం తిరిగకముందే ఆయన మరణం విషాదం నింపింది. ఆకాశ ఫస్ట్ విమానం ఎగిరిన వారానికే ఆయన చనిపోవడం అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆకాశయానంలో కూడా తనదైన ముద్రవేయాలనుకున్న ఆయన కోరిక నెరవేరిన కొద్దిరోజుల్లోనే చనిపోయారు.
రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఇవాళ ఉదయం 6.45 నిమిషాలకు ఆయనకు గుండె పోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం క్యాడీ బ్రీచ్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే మరణించినట్లు చెప్పారు.
గత కొంతకాలంగా రాకేశ్ ఝున్ ఝున్ వాలా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఇదే క్యాండీ బ్రీచ్ ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల క్రితమే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా సడెన్ గా గుండెపోటు రావడంతో మరణించారు.
Also Read:Salman Rushdie: సల్మాన్ రష్డీపై నిషేధానికి 33 ఏళ్లు.. ఇస్లాంపై రచనలతో వివాదాస్పదం!