https://oktelugu.com/

Flop Cars In India: దేశంలో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన కార్లు ఏంటో తెలుసా?

Flop Cars In India: ఒకప్పుడు సైకిల్ ఉంటే చాలా గొప్ప.. మా చిన్నప్పుడు అయితే సైకిళ్లు కట్నంగా కూడా పెట్టేది. అది ఆనాటి సంగతి. కానీ కాలం మారింది. పిల్లతోవలు కాస్తా తారు రోడ్లు అయ్యాయి. సైకిళ్లు కాస్తా బైక్ లు.. కార్లు అవుతున్నాయి. జనాల ఆదాయం పెరిగే కొద్దీ వారి అవసరాలు కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు ఓ మోస్తారు ఎగువ మధ్యతరగతి కుటుంబం కూడా సెకండ్ హ్యాండ్ కార్లు కొని విలాసవంతమైన జీవితం గడిపేస్తున్నాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 27, 2022 / 08:02 AM IST
    Follow us on

    Flop Cars In India: ఒకప్పుడు సైకిల్ ఉంటే చాలా గొప్ప.. మా చిన్నప్పుడు అయితే సైకిళ్లు కట్నంగా కూడా పెట్టేది. అది ఆనాటి సంగతి. కానీ కాలం మారింది. పిల్లతోవలు కాస్తా తారు రోడ్లు అయ్యాయి. సైకిళ్లు కాస్తా బైక్ లు.. కార్లు అవుతున్నాయి. జనాల ఆదాయం పెరిగే కొద్దీ వారి అవసరాలు కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు ఓ మోస్తారు ఎగువ మధ్యతరగతి కుటుంబం కూడా సెకండ్ హ్యాండ్ కార్లు కొని విలాసవంతమైన జీవితం గడిపేస్తున్నాయి.

    Flop Cars In India

    కార్లు.. ఇప్పుడు స్టేటస్ సింబుల్ మాత్రమే కాదు.. అదొక నిత్యావసరంగా మారింది. బైక్ లపై వెళితే.. ఎండా, వానా, చలి.. ఆ తాకిడిని తట్టుకోలేని వారికి సుఖవంతమైన ఏసీ లాంటి సౌకర్యాలున్న కారు బాగా ఆకర్షించింది. ఇక కరోనా మహమ్మారి రాకతో జనాల మైండ్ సెట్ మారింది. లాక్ డౌన్ ముగిశాక అందరూ కార్లు ఎక్కువగా కొంటున్నారు. ఎందుకంటే ముట్టుకుంటే అంటుకునే కరోనా వైరస్ ధాటికి ప్రజారవాణాలో ప్రయాణం బాగా తగ్గిపోయింది. బస్సులు, రైళ్లలో పోతే కరోనా సోకుతుందన్న భయంతో చాలా మంది కొత్త కార్లు.. మధ్యతరగతి వాళ్లు సైతం సెకండ్ హ్యాండ్ కార్లు కొంటూ సురక్షితంగా దూసుకెళుతున్నారు.

    Also Read: TRS Plenary Food Menu: కేసీఆర్ విందు ఇస్తే ఇలాగుంటది

    కరోనా తర్వాత కార్ల అమ్మకాలు బాగా పెరగడంతో వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వివిధ కంపెనీలు కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇండియాలో ప్రస్తుతం ‘మారుతి సుజుకీ’ నంబర్ 1 స్థానంలో ఉంది. అయితే ఎన్నో కొత్త కార్లను ఇదివరకే కంపెనీలు రిలీజ్ చేశాయి. వాటిల్లో కొన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అసలు ఆ కార్లను కొనే నాథుడే లేకుండా పోయాడు. విడుదలైన అన్నీ కార్లు సక్సెస్ కాలేదు. అవి ఫ్లాప్ కావడానికి గల కారణాలు తెలుసుకున్న కార్ల కంపెనీలు తప్పులు సరిదిద్దుకొని మరోసారి అలాంటి తప్పు జరగకుండా కొత్త అప్ డేటెడ్ కార్లను ఉత్పత్తి చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

    ఈ క్రమంలోనే దేశంలో విడుదలై బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిన కొన్ని కార్లు ఉన్నాయి. అవి ఏంటి? ఎందుకు ప్లాప్ అయ్యాయన్న సంగతి తెలుసుకుంది.

    -మహీంద్రా క్వాంటో

    Mahindra Quanto

    మహీంద్రా అండ్ మహీంద్రా భారత దేశపు కంపెనీయే. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ‘జీపు’ల స్థాయి నుంచి దీనికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే మహీంద్రా కంపెనీ 2012లో లాంచ్ చేసిన సెవన్ సీటర్ మినీ ఎస్.యూ.వీ ‘క్వాంటో’ భారత మార్కెట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీని ధర అప్పుడు రూ.5.82 లక్షలు (ఎక్స్ షోరూం)గా నిర్ణయించారు. ఈ కారు ఇదివరకు మహీంద్ర రిలీజ్ చేసిన ‘జైలో’ను పోలి ఉంది. ప్రధానంగా ఈ మినీ ఎస్.యూవీ నగర వినియోగదారుల కోసం డిజైన్ చేసింది. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలుగా ఈ కారును రూపొందించింది . కానీ దీన్ని వినియోగదారులు ఆదరించకపోవడంతో 2020లో ఉత్పత్తిని ఆపివేసింది. ఇక నువో స్పోర్ట్ అనే మహీంద్రా కారు కూడా 2016లో విడుదలై ఆదరణ లేకపోవడంతో దీన్ని కూడా ఉత్పత్తిని ఆపివేసింది. కార్లలో అట్టర్ ఫ్లాప్ అయిన సెగ్మెంట్ లో క్వాంటో మొదటిస్థానంలో ఉంది.

    -నిస్సాన్ ఎవీలియా

    Nissan Evalia

    నిస్సాన్ కంపెనీ 2012లో ‘ఎవీలియా’ అనే కారును ఎంపీవీగా రిలీజ్ చేసింది. నిజానికి ఇది ఒక వ్యాన్ రూపంలో డిజైన్ చేశారు. రూ.8.49 లక్షల ఎక్స్ షోరూం ధరతో విడుదలైంది. అయితే దీనికంటే మెరుగ్గా టయోటా ఇన్నోవా, మహీంద్ర జైలో, మారుతి ఎర్టిగా బాగా క్లిక్ కావడంతో ఈ కారు వినియోగదారులను ఆకట్టుకోలేదు. దీంతో ఎవీలియా ఇండియన్ మార్కెట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఒక వ్యాన్ రూపంలో దీన్ని తయారు చేయడమే దీన్ని ఆదరించకపోవడానికి కారణంగా తెలుస్తోంది. దీంతో 2015లో దీన్ని ఉత్పత్తిని నిస్సాన్ ఆపివేసింది.

    -చెవర్లేట్ ఎంజాయ్

    Chevrolet Enjoy

    దేశంలో పెద్దగా మార్కెట్ లేని కంపెనీ ‘చెవర్లేట్’. ఈ కంపెనీ తయారు చేసిన ‘ఎంజాయ్’ కారు కూడా ఇండియన్ మార్కెట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇది చెవర్లేట్ ఫస్ట్ ఎంపీవీగా 2013లో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. కానీ దీని డిజైన్ బాగాలేకపోవడం.. ఒక వ్యాన్ తరహాలో ఉండడంతో వినియోగదారుల మనసును ‘ఎంజాయ్’ చేయలేకపోయింది. దీంతో 2016లో కంపెనీ దీని ఉత్పత్తిని ఆపివేసింది.

    -డట్ సన్ గో/గో ప్లస్

     

    Datsun Go Plus

    నిస్సాన్ కంపెనీ ఇండియాలో పెద్దగా రాణించకపోవడంతో దాని సబ్ బ్రాండ్ అయిన ‘డట్ సన్’ పేరుతో కార్లను రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే డట్సన్ గో అనే చిన్న కారుతోపాటు.. 7 సీటర్ తో డట్సన్ గో+ను ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. మంచి ఫీచర్లతో ఆకర్షించేలానే ఈ కార్లను డిజైన్ చేసి చాలా తక్కువ ధరనే పెట్టినా ఎందుకో వినియోగదారులను డట్సన్ కంపెనీ ఆకర్షించలేకపోయింది. ఈ కార్లను సేల్స్ చేయలేకపోతోంది.

    -మహీంద్రా వేరిటో వైబ్

    Mahindra Verito Vibe

    మహీంద్రా ‘వేరిటో’ సబ్ సెడాన్ గా 2013లో దేశంలో విడుదల చేశారు.దీన్ని ఏబీఎస్ గానూ మార్చారు. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, యూఎస్.బీ.. అల్లాయ్ వీల్స్ సహా ఆధునిక హంగులన్నీ సమకూర్చారు. చెవర్లేట్ సెయిల్, టయోటా ఎటియాస్ లకు పోటీగా దీన్ని మహీంద్రా లాంచ్ చేసింది. కానీ ఇది కూడా ఫ్లాప్ అయ్యింది. మహీంద్రా లాంచ్ చేసిన జైలో, నువో స్పోర్ట్ లాగే దీన్ని కూడా జనాలు ఆదరించలేదు. బీఎస్6 స్టాండర్డ్ లకు అనుగుణంగా లేకపోవడంతో వినియోగదారులు దీన్నీ కొనేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఈ కారును కూడా మహీంద్రా ఉత్పత్తి ఆపేసి కనుమరుగు చేసింది.

    -చెవర్లేట్ సెయిల్ యూవీ-ఏ

    Chevrolet Sail UV-A

    చెవర్లేట్ కంపెనీ ఇండియా జీఎం-సెయిక్ తో కలిసి జాయింట్ వెంచర్ లో 2012లో విడుదల చేసిన కారే ‘సెయిల్ యూవీ-ఏ’. మారుతి సుజూకీ స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో కు పోటీగా అచ్చం దాని పోలిన ఆకారంలో దీన్ని డిజైన్ చేసి మార్కెట్లోకి వదిలారు. అమెరికాలోనూ దీన్ని విడుదల చేశారు. ఇందులో సెడాన్ వెర్షన్ ను కూడా మారుతి సుజూకీ డిజైర్ తరహాలో మార్చి రిలీజ్ చేశారు. కానీ ఈ రెండూ కార్లు ఫ్లాప్ అయ్యాయి. వినియోగదారులను ఆకట్టుకోకపోవడంతో వీటి ఉత్పత్తిని కంపెనీ ఆపివేసింది.

    -టాటా బోల్ట్ మరియు జెస్ట్

    Tata Bolt & Zest

    ఇక దేశంలోనే ప్రముఖ భారతీయ కార్ల కంపెనీ టాటా నుంచి ఫ్లాప్ అయిన కార్లు ప్రధానంగా రెండు ఉన్నాయి. అందులో హ్యాచ్ బ్యాక్ సెడాన్ వర్షన్ ‘జెస్ట్’ కారు ఇండియన్ మార్కెట్లో ఎంతో ఘనంగా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత బోల్డ్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ అప్ గ్రేడెడ్ కార్ల అమ్మకాలు మాత్రం ఘోరంగా పడిపోయాయి. టాటా బ్రాండ్ కూడా వీటి కొనుగోళ్లకు ఊపు తీసుకురాలేదు. దీంతో వీటికి 2019లో ‘టాటా’ చెప్పేసిన కంపెనీ ఆ తర్వాత మార్పులు చేసి ‘టియాగో’, టిగోర్ గా లాంచ్ చేసింది. వీటికి ఫర్వాలేదనపించేలా అమ్మకాలు సాగడంతో వీటిని ఇండియన్ మార్కెట్లో కొనసాగించింది.

    -నిస్సాన్ టెర్రానో

    Nissan Terrano

    ఇండియన్ మార్కెట్లో బాగా హిట్ అయిన రెనాల్ట్ డస్టర్ కు పోటీగా నిస్సాన్ కంపెనీ ‘టెర్రానో’ను 2013లో రిలీజ్ చేసింది. సేమ్ డస్టర్ కెపాసిటీతోనే ఇంజిన్ సహా అన్ని సమకూర్చింది. కానీ దురదృష్టవశాత్తూ నిస్సాన్ కంపెనీ టెర్రానో కూడా ఇండియన్ మార్కెట్లో సత్తా చాటలేకపోయింది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో ఉన్న డస్టర్, హుండాయ్ క్రెటా ధాటికి టెర్రానో కొట్టుకుపోయింది.

    ఇక ఇదే కాదు.. నిస్సాన్ కంపెనీ ఆ తర్వాత టెర్రానోను అప్ డేట్ చేసి 2019లో లాంచ్ చేసిన ‘కిక్స్ ఎస్.యూ.వీ’ కూడా పెద్దగా ఇండియన్ మార్కెట్ లో రాణించలేకపోయింది. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ కారు లేకపోవడం.. వినియోగదారుల ఆదరణ చూరగొనపోవడంతో 2020లో దీన్ని కంపెనీ ఉత్పత్తిని ఆపు చేసి నిలుపుదల చేసింది.

    ఈ కార్లు ప్రధానంగా ఫ్లాప్ కావడానికి వాటి డిజైన్, సౌకర్యాల లేమితోపాటు వాటి విడిభాగాలు, సర్వీసింగ్ అన్ని చోట్లా లేకపోవడంతోపాటు వినియోగదారుల అభిరుచికి సరితూగలేక కొనేందుకు ముందుకు రాలేదు. ఇక ఈ కార్ల కంటే అత్యంత ఎక్కువ సర్వీసులు ఉండి.. అందుబాటులో తక్కువ ధరలో నాణ్యత, డిమాండ్ కలిగిన మారుతి సుజుకీ సహా హ్యుండాయ్ కార్లు ఉండడంతో వాటినే ఎక్కువగా కొనేస్తున్నారు. వీటికి రీసేల్ వ్యాల్యూ కూడా ఎక్కువగా ఉండడం కూడా కొనుగోలుకు కారణంగా కనిపిస్తోంది. పైన కంపెనీల కార్లకు రీసేల్ వాల్యూ లేకపోవడం కూడా వాటిపై జనాల అయిష్టతకు కారణంగా తెలుస్తోంది. స్థానికంగా అందుబాటులో ఉండే షోరూంలు.. వినియోగదారుల అవసరాలు.. ధరలు.. అభిరుచిని బట్టే ఈ కార్ల కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి.

    Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బెస్ట్ డైలాగ్స్ ఇవే !

    Tags