https://oktelugu.com/

 RBI Governor : బ్యాంకులు డిపాజిట్లు పెంచుకోవాల్సిందే.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

ద్రవ్యోల్పణం ఇప్పటికీ తీవ్రంగానే ఉంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ఉన్న ఆర్థిక మాంద్యం భయాలతో ముప్పు పొంచి ఉంది. ఏదేమైనా దేశీయ మార్కెట్లో మాత్రం కొంత ఆశాజనక వాతావరణం నెలకొని ఉంది. ఈ మేరకు పరాపతి విధాన కమిటీలో ఆర్ బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 9, 2024 / 02:17 PM IST

    Repo Rate

    Follow us on

    RBI Governor : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు పరపతి విధాన కమిటీ మీటింగ్ ఇటీవల జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన గురువారం సాయంత్రం వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకుల పని తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వరుసగా తొమ్మిదోసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ ఆహార ద్రవ్యోల్పణం తీవ్రంగా ఉన్న కారణంగానే కీలక రేట్లను మార్చలేదని చెప్పారు. ద్రవ్యోల్పణంపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. రెపో రేటు 6.5% కొనసాగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో ఆఖరిసారి 2023, ఫిబ్రవరిలో కీలక రేట్లను సవరించడం జరిగింది. ఇక తొమ్మిదో సారి కూడా వరుసగా ఈ రేట్లను మార్చలేదు. ’సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణ‘ను కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే మూడు రోజుల పాటు ఈ కీలక సమావేశం జరిగింది. ఎంపీసీ కమిటీ భేటీ రద్దవుతుందని తొలుత అందరూ భావించారు. కానీ నిర్ణీత తేదీల్లో వీటిని నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి, ద్రవ్యోల్పణం అంచనాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్పు చేయలేదు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7.2 శాతం, ఇక రిటైల్ ద్రవ్యోల్పణం 4.5 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. దీంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్పణం 4.4 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆహార ద్రవ్యోల్పణం ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై ఆర్బీఐ నిశీతంగా పరిశీలిస్తున్నదని శక్తికాంత దాస్ వెల్లడించారు.

    డిపాజిట్లు పెంచుకోవాల్సిందే..
    అధిక రాబడిని ఇచ్చే పెట్టుబడి మార్గాలపై వినియోగదారులు దృష్టి పెడుతున్నారు. దీంతో బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టేవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నది. రుణాలు తీసుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. దీంతో రుణాలు ఇచ్చేందుకు నిధుల సమీకరణ పెద్ద స్థాయిలో లేకపోవడం బ్యాంకులకు సవాలుగా మారింది. బ్యాంకులకు ఇది పెద్ద లోటు సమస్య. అయితే ఆకర్షణీయ పథకాలు, సేవల ద్వారా డిపాజిట్లను పెంచుకోవాలని, ఖాతాదారుల గుర్తింపు పొందాలని సూచించారు. ఖాతాదరుల నుంచి పొదుపు మొత్తాలను మరింత సమీకరించడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలన్నారు.

    దీంతో పాటు గృహరుణాలపై టాప్ అప్ లు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రుణ నిధులపై పర్యవేక్షణ కొంత లోపించిందని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు వ్యక్తిగత రుణాలపై సమీక్ష ఉండాలని బ్యాంకులకు సూచించారు. ఆర్బీఐ కొంత సమీక్షిస్తున్నప్పటికీ వ్యక్తిగత రుణాల్లో వృద్ధి కొనసాగుతున్నదని చెప్పారు. ముఖ్యంగా వినియోగ అవసరాల కోసం తీసుకునే రుణాల తీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు.

    ఆర్బీఐ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అనధికారిక డిజిటల్ రుణ యాప్ లను నియంత్రించేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. యూపీఐ ద్వారా డెలిగేటెడ్ పేమెంట్స్ సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్రతిపాదించింది. చెక్కుల చెల్లింపుల ప్రక్రియను మరింత వేగిరం చేసేందుకు కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం బ్యాచ్ ల వారీగా చెక్కులను క్లియర్ చేస్తున్నారు. దీంతో రెండు రోజుల సమయం పడుతున్నది. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే వీటికి క్లియరెన్స్ ఇచ్చేలా చూడాలని నిర్ణయించింది. యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుల లావాదేవీని ప్రస్తుతం ఉన్న రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది.