https://oktelugu.com/

Ratan Tata : నో .. నెవ్వర్.. అంబానీ, ఆదానీలు.. ఎప్పటికీ రతన్ టాటా కాలేరన్నది ఇందుకే

ఓ అదాని తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరిస్తుంటాడు. ప్రభుత్వాలకు వందల కోట్లు విరాళంగా ఇచ్చి తన సిమెంట్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయించుకుంటాడు. అది ఒక రకమైన క్రోనీ క్యాపిటలిజం. ఇక అంబానీ అంటారా.. వేడుకలకు, విలాసాలకు మాత్రమే ప్రసిద్ధి.. తను ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా.. సమాజానికి ఏమీ ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా అందులోనూ వ్యాపారమే ఉంటుంది.. అందుకే వారు వ్యాపారవేత్తలుగానే మిగిలిపోయారు. కానీ ఈ జాబితాలో రతన్ టాటా పూర్తి విభిన్నం.

Written By:
  • Dharma
  • , Updated On : October 26, 2024 10:27 am
    Ratan Tata

    Ratan Tata

    Follow us on

    Ratan Tata :  మొన్న రతన్ టాటా గతించిన తర్వాత మనం అనేక కథనాల్లో చెప్పుకున్నాం.. ఆయన ఎంత గొప్పవాడో.. ఆయన మనసు ఎంత గొప్పదో.. ఆయన ఆలోచనలు ఎంతటి విశాలమైనవో.. అంతటి కరోనా కాలంలో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంటే.. తను మాత్రం బయటికి వచ్చాడు. ఏకంగా 150 కోట్లు ఇచ్చాడు. ఈ దేశం కోసం.. ఈ దేశ ప్రజల బాగుకోసం తన యావత్ ఆస్తి మొత్తం ఇస్తానని ప్రకటించాడు. అంతేనా అంతకుముందు ఉగ్రవాదుల దాడి వల్ల ముంబై తాజ్ హోటల్ ధ్వంసం అయితే.. దాన్ని ఆధీనంలోకి తీసుకున్నాడు. పూర్తి రూపం వచ్చేలా చేసాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే రతన్ టాటా వ్యక్తిత్వం వర్ణనకు అందదు. అటువంటి వ్యక్తి అనారోగ్యంతో ఇటీవల కన్నుమూశాడు.. గొప్పవాళ్లు కన్నుమూస్తే ఒక జాతి మొత్తం శోకిస్తుంది. అతని జ్ఞాపకాల్లో మునిగి తేలుతుంది. రతన్ టాటా మరణించినప్పుడు కూడా ఈ దేశం మొత్తం శోక తప్త హృదయంతో నివాళులర్పించింది. వయస్సు సంబంధం లేకుండా.. రతన్ టాటా ను తమ వాట్సాప్ డీపీలుగా పెట్టుకుంది. ఒక మనిషి చేసిన మంచి అతడిని వందేళ్లపాటు బతికిస్తుంది అంటారు. అలాంటి పని రతన్ టాటా చేశాడు కాబట్టే ఇవాల్టికి అతడిని మర్చిపోలేకపోతోంది ఈ భారత జాతి. ఇకపై మర్చిపోయే అవకాశం కూడా లేదు. ఉన్నప్పుడు గొప్ప గొప్ప పనులు చేసి దేశ యవనిక మీద చెరగని ముద్రవేసిన రతన్ టాటా.. తన బతికి ఉన్నప్పుడు రాసిన వీలునామా ద్వారా కూడా అదే స్థాయిలో ప్రజలను ప్రభావితం చేయగలుగుతున్నారు. ఇంతకీ ఆయన ఆ వీలు నామాలో ఏం రాశారంటే..

    30 లక్షల కోట్లు..

    ఇప్పటి మార్కెట్ లెక్కల ప్రకారం టాటా గ్రూప్ కంపెనీల ఆస్తుల విలువను లెక్కిస్తే 30 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. టాటా గ్రూప్ ను ఈ స్థాయికి చేర్చడం వెనక రతన్ టాటా తీవ్రంగా కృషి చేశారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ అనేక వ్యాపారాల్లోకి ప్రవేశించింది. లక్షల మందికి ఉపాధి కల్పించింది. కొత్త కొత్త అవకాశాలను సృష్టించింది. రతన్ టాటా కన్నుమూయడంతో.. టాటా గ్రూప్ కు తదుపరి వారసుడిగా రతన్ సవతి సోదరుడు నోయల్ టాటా నియమితులయ్యారు. ఈ క్రమంలో రతన్ టాటా ఆస్తులకు సంబంధించి మొన్నటిదాకా ఒక చిక్కు ప్రశ్న ఉండేది. అవి ఎవరికి చెందాలనేది ఒకింత ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో రతన్ టాటా తను సంపాదించిన ఆస్తుల్లో ఎక్కువ శాతం విరాళాలకే కేటాయించారు. దాంతోపాటు కొన్ని దాతృత్వ సంస్థలకు రాసిచ్చారు.

    రతన్ టాటా కు 10,000 కోట్ల ఆస్తి

    రతన్ టాటాకు దాదాపు పదివేల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అలీబాగ్ ప్రాంతంలో రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద భవంతి ఉంది. ముంబైలోని జుహు తారా రోడ్ లో రెండు అంతస్తుల భవనం ఉంది. ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో 350 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఇక టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయినటువంటి టాటా సన్స్ లో 0.83 శాతం వాటా రతన్ కు ఉంది. అయితే తన సంపదలో ఎక్కువ శాతం ఎండోమెంట్ ఫౌండేషన్ కు రతన్ తను జీవించి ఉన్నప్పుడే బదిలీ చేయించారు.

    పెంపుడు శునకానికీ వాటా

    రతన్ కు కుక్కలను ఇష్టంగా చూసేవారు. వాటిని అమితంగా ప్రేమించేవారు. ఆయనకు జర్మన్ షెఫర్డ్ టిటో అనే పెంపుడు కుక్క ఉండేది. దానికోసం “అన్లిమిటెడ్ కేర్” పేరుతో ఒక వీలునామా రాశారు. అందులో ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. ఆ కుక్కను రాజన్ షా అనే వ్యక్తి చూసుకుంటారు. ఆ కుక్క తో పాటు వంట మనిషి సుబ్బయ్య, రాజన్ షా కు రతన్ తన ఆస్తిలో కొంత భాగాన్ని ఇచ్చారట. రతన్ టాటాకు అత్యంత ఆత్మీయుడైన శంతను నాయుడుకు ఆస్తిలో కొంత భాగం ఇచ్చారట. మీరు మాత్రమే కాకుండా జిమ్మీ టాటా, సవతి సోదరులు షిరీన్, డీనా జెజిబోయ్ తో పాటు ఇంట్లో సిబ్బందికి కూడా రతన్ వాటాలు ఇచ్చారట.

    వీధి శునకాల కోసం..

    రతన్ బతికి ఉన్నప్పుడు వీధి శునకాల కోసం ఎంతగానో తాపత్రయపడేవారు. కుక్కల కోసం హాస్పిటల్స్ కట్టించారు. ముంబైలోని ఐదు అంతస్తుల భవనంలో పెట్ ప్రాజెక్టు పేరుతో కుక్కల కోసం ఒక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.. మొత్తంగా చూస్తే రతన్ టాటా తన రక్తసంబంధీకుల నుంచి మొదలు పెడితే కుక్కల వరకు ఆస్తుల్లో వాటాలు ఇచ్చారు. విశ్వ మానవుడిగా అవతరించారు. అందుకే అంబానీలు, అదానీలు డబ్బు సంపాదించవచ్చు గాక.. విఖ్యాత వ్యాపారవేత్తలుగా పేరు పొందవచ్చు గాక.. కానీ వారు ఎప్పటికీ రతన్ టాటా కాలేరు. కాబోరు. అలా అవ్వడానికి ప్రయత్నం కూడా చేయరు.