Dairy Farming: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నా ఆ పథకాల వల్ల రైతులకు పూర్తిస్థాయిలో ప్రయోజనాలు అందడం లేదనే సంగతి తెలిసిందే. పీఎం కిసాన్, రైతు బంధు, రైతు భరోసా లాంటి కొన్ని పథకాల ద్వారా అందుతున్న మొత్తం మాత్రమే రైతులకు ఆర్థికంగా అంతోఇంతో ప్రయోజనం చేకూర్చుతోంది. డెయిరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ స్కీమ్ ను కేంద్రం రైతుల కోసం అమలు చేస్తోంది.
ప్రస్తుతం పశుసంవర్ధక రంగంలో ఎక్కువ సంఖ్యలో అవకాశాలు ఉండగా పాల వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం రైతులకు సబ్సిడీని అందిస్తోంది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. అసంఘటిత రంగానికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఈ స్కీమ్ తోడ్పడుతుందని చెప్పవచ్చు.
దూడల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు కొత్త ఆధునిక డెయిరీ ఫామ్‌ల ఏర్పాటు కూడా ఈ స్కీమ్ యొక్క లక్ష్యమని చెప్పవచ్చు. డైరీ రంగంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకొనిరావాలనే ఆలోచనతో ఈ స్కీమ్ అమలవుతోంది. డెయిరీ ఏర్పాటు కోసం చేసే ఖర్చు విషయంలో సబ్సిడీ ఇవ్వడంతో పాటు పాలు ఇచ్చే 10 జంతువులకు సబ్సిడీ ఇస్తారని తెలుస్తోంది.
పాల ఉత్పత్తులని ప్రాసెసింగ్ చేసే పరికరాలను కొనుగోలు చేసినా సబ్సిడీని పొందవచ్చు. కోల్డ్ స్టోరేజీ యూనిట్ ను ఏర్పాటు చేయడం ద్వారా పాలు, పాల ఉత్పత్తుల సంరక్షణ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. డెయిరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ స్కీమ్ ద్వారా రైతులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రైతులు పారిశ్రామిక వేత్తలు కూడా బెనిఫిట్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.