AP Govt Free Electricity Scheme: ఏపీలో ఉచిత విద్యుత్ కు ప్రభుత్వం మంగళం పలికిందా? 18 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతున్న పథకాన్ని జగన్ సర్కారు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందా? నాడు తండ్రి పెట్టిన పథకాన్ని నిలిపివేయడానికి కుమారుడే ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రైతులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి పంప్ సెట్లకు మీటర్లు లేవు. బిల్లులూ వసూలు చేయడం లేదు. ఏ ప్రభుత్వమూ అలాంటి ఆలోచన కూడా చేయలేదు. ఎలాంటి అవాంతరాలూ లేకుండా సాఫీగా అమలవుతున్న ఈ పథకానికి జగన్ సర్కారు క్రమంగా తూట్లు పొడుస్తోందని రైతాంగం ఆందోళన చెందుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు, షరతులే ఇందుకు కారణం. పంప్ సెట్లకు మీటర్లు అమర్చడాన్ని, షరతులను రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధి పొందాలంటే మోటార్లకు మీటర్లు బిగించేందుకు రైతులు కచ్చితంగా ఆమోదం తెలపాలని డిస్కమ్‌లు చెబుతున్నాయి.
మభ్యపెడుతున్న సర్కారు..
అయితే ఈ విషయంలో జగన్ సర్కారు వక్రభాష్యం చెబుతోంది. నెలవారీ విద్యుత్ వాడకం బిల్లుల మొత్తాలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖాతాల నుంచి డిస్కమ్‌లు నేరుగా డబ్బు తీసుకుంటాయని వెల్లడించింది. రైతులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. రైతు ఖాతా నుంచి నేరుగా డిస్కమ్‌లకు బిల్లులు చెల్లించడం వల్ల కరెంటు సరఫరాలో లోపాలుంటే డిస్కమ్‌లను నిలదీసే హక్కు ఉంటుందని సీఎం జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. అయితే అసలు తిరకాసు ఇక్కడే మొదలైంది. నెలవారీ బిల్లులను డిస్కమ్‌లు వసూలు చేసుకునేందుకు వీలుగా రైతులు తమ బ్యాంకు ఖాతా నంబర్ ఇవ్వడంతో పాటు బ్యాంకులకు ఆథరైజేషన్ ఇవ్వాలి. ఇందుకోసం రైతుల నుంచి సంతకాల సేకరణను డిస్కమ్‌లు ప్రారంభించాయి. సంతకాలు చేసిన వారే ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధి పొందుతారని, లేదంటే రైతులు వాడిన విద్యుత్‌కు వారే బిల్లులు చెల్లించుకోవాలని డిస్కమ్‌లు స్పష్టం చేసున్నాయి. శ్రీకాకుళంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన మోటార్లకు మీటర్ల బిగింపు కార్యక్రమంలో భాగంగా రైతుల నుంచి ఆథరైజేషన్ పత్రాలు తీసుకుంటున్నారు.అయితే ఆచరణలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం ఎవరిది? ఈ పథకం అమలు కోసం బ్యాంకులకు ఆథరైజేషన్ ఇవ్వాల్సింది ఎవరు?’’ అని ప్రభుత్వాన్ని రైతులు నిలదీస్తున్నారు. ఇతర పథకాల తరహాలోనే ఈ పథకం కూడా నీరుగారిపోతుందని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Posani Sensational Comments On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని
డిస్కమ్‌ల ఒత్తిడి
రాష్ట్రమంతా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్యుత్ వాడకంపై వాస్తవ గణాంకాలు తెలుసుకునేందుకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు చెబుతున్నారు. మీటర్ల రీడింగ్ మేరకు బిల్లులను వ్యక్తిగతంగా రైతులకు అందజేస్తారని, ఆ మొత్తాన్ని మాత్రం ప్రభుత్వమే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని డిస్కమ్‌లు చెబుతూ వచ్చాయి. ఈ జమ చేసిన మొత్తాన్ని డిస్కమ్‌లు రైతుల బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రా చేసుకుంటాయని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.
అయితే రైతుల ఖాతాల్లోకి విద్యుత్ బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వం వేసినప్పటికీ.. వారి ఆమోదం లేకుండా డిస్కమ్‌లు నేరుగా డబ్బులు విత్‌డ్రా చేసుకోలేవు. ఈ బిల్లులు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా బ్యాం కులకు ఆథరైజేషన్ ఇవ్వాలని రైతులపై డిస్కమ్‌లు ఒత్తిడి తెస్తున్నాయి. తామెందుకు బ్యాంకులకు ఆథరైజేషన్ ఇవ్వాలని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈసీఎస్ విధానంలో ఆర్థిక సంస్థలు నెలవారీగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు నేరుగా విత్‌డ్రా చేసుకునే విధానం ప్రస్తుతం అమలులో ఉంది. గృహ, వాహన, ఇతర వస్తువులను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటారు. ఇలా తీసుకున్న రుణాలను ప్రతినెలా నిర్ణీత మొత్తంలో వాయిదాల రూపంలో చెల్లిస్తారు. ఆర్థిక సంస్థలు ముందుగా నిర్దేశించుకున్న మొత్తాన్ని మాత్రమే ప్రతినెలా విత్‌డ్రా చేసుకుంటాయి. కానీ రైతులకు ప్రభుత్వం అందించే ఉచిత విద్యుత్ పథకంలో బిల్లులు ప్రతినెలా ఒకేలా వచ్చే అవకాశం లేదు. రైతు వాడే కరెంటును బట్టి నెలవారీ బిల్లు వస్తుంది. ఒక నెల బిల్లు మొత్తం ఎక్కువగా, మరో నెల తక్కువగా రావచ్చు. ఇలా బిల్లులు అస్థిరంగా వచ్చే వీలున్నందున తమ ఖాతాల నుంచి డిస్కమ్‌లు డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు ఎలా ఆథరైజేషన్ ఇస్తామని రైతులు ప్రశ్నిస్తున్నారు.
సందేహాలు ఇవీ..
విద్యుత్ బిల్లుల్లో తప్పులు దొర్లే అవకాశముంది. అలాంటప్పుడు బ్యాంకుల్లో వ్యక్తిగతంగా దాచుకున్న డబ్బును డిస్కమ్‌లు విత్ డ్రా చేసుకుంటే రైతుల పరిస్థితి ఏమిటి? ఎవరిని అడిగాలి? జవాబుదారు ఎవరు?
రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఎప్పుడు డబ్బు వేస్తుందో చెప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులకు ఆథరైజేషన్ ఇవ్వాలనడం సబబా?
ప్రభుత్వం కచ్చితంగా నెల నెలా రైతుల ఖాతాల్లో విద్యుత్ బిల్లులు జమ చేస్తుందని గ్యారెంటీ ఏమి టి? కాంట్రాక్టర్లకు బిల్లులు, ఉద్యోగులకు జీతాలు సమయానికి చెల్లించడం లేదు.
ఆథరైజేషన్ ఇచ్చాక ప్రభుత్వం ఖాతాల్లో డబ్బులు వేయకపోయినా రైతుల ఖాతాల నుంచి డిస్కమ్‌లు డబ్బులు విత్‌డ్రా చేసే వీలుంది. ఖాతాల్లో సరిపడనంత నగదు లేకుంటే ఒక విధంగా డిఫాల్టర్ కిందకు వస్తుంది.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉచిత విద్యుత్ కోసం రైతుల పేరిట ప్రభుత్వమే ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను తెరవాలి. అప్పుడు బ్యాంకులకు ఆఽథరైజేషన్ ఇచ్చినా సమస్య ఉండదు. ప్రస్తుతమున్న ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామంటే కుదరదని, వివరాలు ఇచ్చేది లేదని రైతాంగం స్పష్టం చేస్తోంది.
Also Read:Interesting Facts In CAG Report: కాగ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు.. ఏపీ అప్పులు తక్కువేనా?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Break for free electricity scheme in ap
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com