
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పెద్దిపాలానికి చెందిన భవాని మరణం కేసును పోలీసులు ఛేదించారు. ముందుగా ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఆ తరువాత విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. స్థానిక ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న భవాని, భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి పోలీస్ క్వార్టర్స్ లో నివాసముంటోంది. భర్త సింహాద్రి ఎప్పడూ భవానితో గొడవ పడుతుండేవాడు. రెండు రోజుల కిందట విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భవాని ఫోన్ చెక్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. ఆగ్రహంతో ఊగిపోయిన సింహాద్రి ఆమెను తీవ్రంగా కొట్టి మెడకు ఉరి బిగించి చంపేశాడు. అయితే ఆ తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అయితే ఆత్మహత్యగా ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు లోతుగా పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది.