తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులలోని చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణలోని సికింద్రాబాద్లోని సెయింట్ మేరీ, వెస్లీ చర్చిల్లో శుక్రవారం ఉదయం నుంచే ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అత్యంత పురాతనమైన మెదక్ చర్చిలో అర్ధరాత్రి నుంచే వేడుకలము మొదలయ్యాయి. చర్చి పాస్టర్ సాల్ మాన్ రాజు ఏసు సందేశాలు అందిస్తున్నారు. ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఆయా చర్చిల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి తదితర నాయకులు హాజరై క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని రాజ్ భవన్ ను విద్యుద్దీపాలతో అలంకరించారు. క్రుష్ణా జిల్లా నందిగామలో వేడుకలు నిర్వహించుకుంటున్నారు. కోటగిరి లంకలో ఆర్సీఎం చర్చిలో భారీ క్రిస్మస్ స్టార్ ఆకర్షణగా నిలచింది.