
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగతున్న వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టీవీల ముందు, ప్రజల ముందు ఆ దేవుని దయతో అని చెప్పడం కాదని..దేవుళ్లకు జరుగుతున్న అవమానాలపై జగన్ రెడ్డి మాట్లాడాలని డిమాండ్ చేశారు. మొన్నటి రామతీర్థం ఘటన మరువకముందే ఇప్పుడు రాజమండ్రిలో విఘ్నేశ్వరాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి చేతులు విరగొట్టారని మండిపడ్డారు. అహంకారాన్ని వీడకపోతే ఆ దేవుడే తమ మదాన్ని అణగదొక్కుతారని ఆయన హెచ్చరించారు. ఏపీలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదన్నారు. జగన్ పాలనలో ప్రజలకే కాదు.. దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడో లేడో కూడా అర్థం కావడం లేదని మండిడ్డారు. మాన్యాలపై ఉన్న శ్రద్ధ దేవుడిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం అలసత్వం వీడకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.