Vijayasai Reddy Vs YV Subba Reddy: విజయసాయి మనుషులను ఏరేస్తున్న వైవీ సుబ్బారెడ్డి

విషయమైనా ఆయన సోషల్ మీడియాలో పంచుకుంటారు. కానీ ఇప్పుడు అలికిడి లేదు. ఇటువంటి సమయంలో తనను నమ్ముకున్నవారిపై వైవీ వేటు వేయడంపై విజయసాయిరెడ్డి సైలెంట్ గా ఉండే అవకాశం లేదు. ఏం చేస్తారన్నది వైసీపీ వర్గాల్లోనే ఉత్కంఠగా మారింది.

Written By: Dharma, Updated On : May 14, 2023 3:27 pm
Follow us on

Vijayasai Reddy Vs YV Subba Reddy: మొన్నటివరకూ ఉత్తరాంధ్ర సీఎంగా విజయసాయిరెడ్డి ఒక వెలుగు వెలిగారు. జగన్ కు సామంతరాజుగా సాగర నగరంలో సరికొత్త రాజకీయాలు చేశారు. కానీ ఉన్నట్టుండి ఆయనపై వేటు వేశారు. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి చేతిలో పెట్టేశారు. కానీ విశాఖతో అనుబంధాన్ని తెంచుకోని విజయసాయిరెడ్డి మళ్లీ ఇక్కడ అడుగు పెట్టేందుకు ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డితో ఆయన గట్టి ఫైట్ చేస్తున్నారు. లోపల నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. విషయం తెలిసి వైవీ జాగ్రత్త పడుతుండడంతో ఇరువురి నేతల మధ్య వివాదం ముదురుతోంది.

వైసీపీ శ్రేణుల్లో అంతర్మథనం..
అయితే ఆ ఇద్దరి నేతల పుణ్యమా అని పార్టీ శ్రేణులు నలిగిపోతున్నాయి. కరవమంటే కప్పకు కోపం.. వీడమంటే పాముకు కోపం అన్న చందంగా వారి పరిస్థితి మారిపోయింది. మూడు రోజుల కిందట విజయసాయిరెడ్డి అనుచరుల్ని పార్టీ పదవుల నుంచి తొలగించారు సుబ్బారెడ్డి. వెంటనే విజయసాయిరెడ్డి పార్టీ అనుబంధ సంఘాల ఇంచార్జ్ హోదాలో మళ్లీ వారిని పార్టీ పదవుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత .. సుబ్బారెడ్డి అసలు వారిని పార్టీ నుంచే సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలతో విశాఖలో వైసీపీ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయి. ఏ నాయకుడ్ని అనుసరించాలో వారికి పాలుపోవడం లేదు.

కొనసాగుతున్న ఫాలోయింగ్..
అయితే బాధ్యతల నుంచి తప్పించినా విశాఖలో విజయసాయిరెడ్డి ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. అక్కడ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా విజయసాయిరెడ్డి తనకంటూ ఒక గ్రూపును ఏర్పాటుచేసుకున్నారన్న టాక్ ఉంది. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి సస్పెండ్ చేసిన ఓ డివిజన్ కార్పొరేటర్, మరో డివిజన్ ఇన్ చార్జి విజయసాయికి నమ్మిన బంట్లు. గతంలో ఆయన విగ్రహం పెట్టి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అటువంటి వారిని వైవీ సుబ్బారెడ్డి టచ్ చేయడం విజయసాయిరెడ్డి సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఏదో ఒకటి చేస్తారు..
అయితే గత కొన్నాళ్లుగా విజయసాయిరెడ్డి వేరే రూట్లో ఉన్నారు, ఢిల్లీకి పరిమితమయ్యారు. ఆయన ప్రాధాన్యతను అధినేత జగన్ తగ్గించేశారన్న ప్రచారం ఉంది. దీంతో ఆయన తాడేపల్లి ప్యాలెస్ వైపు చూడడం లేదన్న టాక్ నడుస్తోంది. అయితే రిజైన్ చేసిన బాలినేని స్థానాన్ని కట్టబెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇంతవరకూ దానిపై విజయసాయి స్పందించలేదు. ఏ విషయమైనా ఆయన సోషల్ మీడియాలో పంచుకుంటారు. కానీ ఇప్పుడు అలికిడి లేదు. ఇటువంటి సమయంలో తనను నమ్ముకున్నవారిపై వైవీ వేటు వేయడంపై విజయసాయిరెడ్డి సైలెంట్ గా ఉండే అవకాశం లేదు. ఏం చేస్తారన్నది వైసీపీ వర్గాల్లోనే ఉత్కంఠగా మారింది.