YSRCP strategy: ఏపీలో( Andhra Pradesh) వచ్చే ఎన్నికలే ధ్యేయంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అవి చేయని ప్రయత్నం అంటూ లేదు. తెలుగుదేశం పార్టీ కూటమిలో జనసేన, బిజెపి ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఉంది. టిడిపి కూటమికి కాపులతో పాటు కమ్మ సామాజిక వర్గం అండగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో బీసీలు సైతం అండగా నిలవడంతో కూటమి ఘనవిజయం సాధించింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గంతో పాటు దళిత ఓటు బ్యాంకు ఉంది. అయితే ఆ రెండు సామాజిక వర్గాల్లో సైతం మొన్నటి ఎన్నికల్లో చిన్నపాటి చీలిక వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయానికి కూడా అది ఒక కారణం. అయితే ఏపీలో పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులు ఎవరికి మద్దతు తెలిపితే వారే విజయం సాధిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అదే కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కాపుల్లో చీలిక తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే దళిత కార్డు ఒకటి బయటకు వచ్చింది. కాపులు, దళితులు కలిస్తే రాజ్యాధికారం తప్పకుండా లభిస్తుందని దళిత వర్గానికి చెందిన ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్ చేసిన ప్రకటన ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది.
మధ్యలో జడ శ్రవణ్ కుమార్ ప్రస్తావన..
దళిత మహాసభల కు సంబంధించిన కార్యక్రమం ఒకటి జరిగింది. అందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐపీఎస్ సునీల్ కుమార్( IPS Sunil Kumar) కాపులతో దళితులు చేతులు కలపాలని.. అప్పుడే కాపులకు దూరమైన రాజ్యాధికారం దక్కుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా డిప్యూటీ సీఎం పదవిని జడ శ్రావణ్ కుమార్ లాంటి నేతలు తీసుకోవాలని చెప్పడం ద్వారా అసలు విషయాన్ని చెప్పేసారు. గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు జడ శ్రవణ్ కుమార్. 2024 ఎన్నికలకు ముందు శ్రావణ్ కుమార్ తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవారు. కానీ ఎన్నికల్లో సరైన ప్రాధాన్యం, ఆపై తాను కోరిన వారికి సీట్లు ఇవ్వకపోవడంతో శ్రవణ్ కుమార్ లో మార్పు వచ్చింది. క్రమేపి ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. మరోవైపు సునీల్ కుమార్ సైతం వైసీపీ హయాంలో ఇంటలిజెన్స్ ఐజిగా పనిచేశారు. అప్పట్లో టిడిపి కూటమి నేతలను వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సునీల్ కుమార్ నోటి నుంచి కాపులు, దళితులు కలవాలన్న కామెంట్ రావడం.. జడ శ్రవణ్ కుమార్ ప్రస్తావన రావడంతో దాని వెనుక వైసీపీ ప్రయోజనాలు ఉన్నాయని అర్థమవుతోంది.
ఏ అవకాశం వదలని వైనం..
కూటమికి అండగా ఉన్నారు కాపులు. గత కొద్ది రోజులుగా కాపు సామాజిక వర్గం విషయంలో కమ్మ సామాజిక వర్గం దాడులకు తెగబడుతోందని వైసీపీ( YSR Congress party) ప్రచారం చేసుకుంటూ వస్తోంది. కాపులకు సంబంధించిన ఏ అంశం బయటకు వచ్చిన దానిని తెర పైకి తెస్తూ రాజకీయ ప్రయోజనాలను దక్కించుకోవాలని ఉబలాటపడుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇప్పుడు దళిత కార్డును ఉపయోగించి… కాపుల్లో చీలిక తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. లేకుంటే ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దళితులు అండగా ఉంటూ వచ్చారు. వారిలో సైతం మార్పు కనిపిస్తోంది. ఇంకో వైపు చూస్తే కాపులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్మేస్థితిలో లేరు. అందుకే కూటమితో పాటు జనసేనకు అండగా నిలిచే కాపులను డైవర్ట్ చేస్తే.. మిగతా వర్గాలతో ఈజీగా అధికారంలోకి రావచ్చు అని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే కుల సమీకరణలతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ వచ్చింది. టిడిపి హయాంలో ఉన్న కాపు రిజర్వేషన్ ఉద్యమం వైసీపీ రాగానే ఆగిపోయింది. ఇప్పుడు చూస్తుంటే కాపులతో దళితులు చేతులు కలపాలి అన్న డిమాండ్ వచ్చింది. మొత్తానికి అయితే జగన్ గట్టి ప్లానే వేసినట్లు తెలుస్తోంది. మరి అది వర్కౌట్ అవుతుందా? లేదా? చూడాలి.