YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడం లేదు. ఉన్న బలం తగ్గుతోంది. గ్రాఫ్ పడిపోతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఆ పార్టీ పరిస్థితి నానాటికి తీసి కట్టుగా మారుతోంది. శ్రీకాకుళం జిల్లాలో అయితే పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. పార్టీలో సీనియర్ల చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. మిగతావారు సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణ దాసు, తమ్మినేని సీతారాం, సిదిరి అప్పలరాజు.. ఇలా అందరూ నైరాస్యంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం తమ్మినేని తో పాటు అప్పలరాజు చుట్టూ పోలీస్ కేసులు నడుస్తున్నాయి. ధర్మాన బ్రదర్స్ వ్యూహాత్మక సైలెన్స్ పాటిస్తున్నారు.
* తగ్గిన గ్రాఫ్..
ఇటీవల ఓ సర్వేలో శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ పెద్దలను కలవరపరుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా జిల్లాలో ధర్మాన బ్రదర్స్ ఉన్నారు. అయితే ఓటమి తర్వాత ధర్మాన ప్రసాదరావు పూర్తిగా నైరాస్యంలోకి వెళ్లిపోయారు. కానీ మొన్న ఆ మధ్యన మళ్లీ యాక్టివ్ అయినట్టు కనిపించారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్కు పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ధర్మాన కృష్ణ దాస్ సైతం జిల్లాలో పెద్దగా కనిపించడం లేదని సమాచారం. అయితే ఆ ఇద్దరు నేతలు తమ వారసులకు ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు, కృష్ణ దాస్ కుమారుడు కృష్ణ చైతన్యలకు నియోజకవర్గాల ఇన్చార్జిలుగా ప్రకటించాలని జగన్ పై ఒత్తిడి ఉంది. కానీ ఆయన ఆ ప్రకటన చేయడం లేదు. అందుకే ధర్మాన బ్రదర్స్ వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటిస్తున్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన తో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే కూటమి పార్టీలో చేరేందుకు సైతం వారు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* కేసుల బారిన నేతలు..
మరోవైపు మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఫ్యామిలీ ఓ భూమి కబ్జా కేసులో ఇరుక్కుంది. ఇప్పటికే సీతారాంను రాజకీయంగా ప్రాధాన్యత తగ్గించారు జగన్మోహన్ రెడ్డి. ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంటరీ బాధ్యతలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆమదాలవలస నుంచి ఛాన్స్ లేదని తేల్చేశారు. ఇంతలోనే ఆయన మెడకు భూకబ్జా కేసు చిక్కుకుంది. ఇంకోవైపు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరిస్థితి బాగాలేదు. ఆయన కుమారుడు బైక్ ప్రమాదంలో ఒకరి మరణానికి కారణమయ్యారు. అయితే ఆ కేసును తారుమారు చేసే క్రమంలో అడ్డంగా బుక్కయ్యారు అప్పలరాజు. ఇలా సీనియర్ నేతలు ఒకవైపు కేసుల్లో చిక్కుకోగా.. ఇంకోవైపు పెద్దదిక్కుగా ఉన్న ధర్మాన బ్రదర్స్ వ్యూహాత్మక సైలెన్స్ పాటిస్తున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు.


