YSRCP Raffa Raffa Controversy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ రఫ్ఫా రఫ్ఫా డైలాగు విడిచి పెట్టడం లేదు. వారు ఇప్పటికీ అల్లు అర్జున్ కు ప్రచారకర్తలుగా మారినట్లు ఉన్నారు. ఎక్కడైనా పార్టీలకు సినిమా హీరోలు ప్రచారం చేస్తారు. కానీ వైసీపీ మాత్రం అల్లు అర్జున్ కు ప్రచారం చేస్తోంది. పవన్ కళ్యాణ్ పై ఉన్న కోపంతో.. అదే కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ చుట్టూ వైసిపి రాజకీయాలు తిరుగుతున్నాయి. తద్వారా అల్లు అర్జున్ అభిమానులను సొంతం చేసుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ తరహా ప్రయత్నాలు చేయడం మామూలే. అయితే దాని ముసుగులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇతర హీరోల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అక్కడితో ఆగకుండా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చూపించిన విలనిజం తో చేసిన డైలాగు రఫ్ఫా రఫ్ఫా ను వీడడం లేదు.
Also Read: వైసిపి స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరణ?!
ఫ్లెక్సీల హడావిడి..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) అవినీతి అక్రమాస్తుల కేసుల్లో నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో కూడా పుష్ప డైలాగ్ తో కూడిన ఫ్లెక్సీలు దర్శనం ఇవ్వడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే గత ఐదేళ్ల వైసిపి పాలన చూశారు. విధ్వంసం చూశారు. ఇప్పుడు కూడా అదే తరహా వాతావరణం ఉంటుందని హెచ్చరిస్తూ ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మాత్రం మంచి పద్ధతి కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తటస్థులతో పాటు ఏ పార్టీతో సంబంధం లేని వారు మాత్రం దీనిని హర్షించరు. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే కచ్చితంగా భయపడతారు. ఆ డైలాగ్ అల్లు అర్జున్ పనికి వచ్చిందేమో కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎంత మాత్రం మైలేజ్ రాదు. ఈ విషయం ఆ పార్టీ అగ్రనేతలకు తెలుసు. అత్యుత్సాహంలో మాత్రం లేనిపోనివి చేస్తున్నారు.
Also Read: పిఠాపురం వైసీపీ నుంచి వంగా గీత ఔట్!
కేసులతోపాటు అరెస్టులు
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ స్థాయిలో ఉన్నారు తెలియనిది కాదు. అప్పట్లో దూకుడుగా వ్యవహరించిన నేతలంతా కేసుల తో బాధపడుతున్నారు. జైళ్లతో పాటు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని కొనసాగిస్తే మాత్రం ఇబ్బందికరమే. అయితే ప్రజల్లో సానుభూతి పొందాలి కానీ.. మేం వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని తిరిగి హెచ్చరిస్తుండడం మాత్రం ప్రజల్లో ఆలోచనకు గురిచేస్తోంది. ప్రతిపక్షంలో ఉంటేనే ఇలా ఉంటే.. అధికారపక్షంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో ఉంది. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొన్నటివరకు అధికారంలో ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఆ పార్టీ పాలన బాగా లేకపోవడం వల్లే ప్రజలు టిడిపి కూటమికి పట్టం కట్టారు. ఇటువంటి సమయంలో గుణపాఠాలు నేర్చుకోకపోతే మాత్రం ఆ పార్టీకే నష్టం.