YCP MLAs: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఎమ్మెల్యేలు డబుల్ గేమ్ ఆడుతున్నారా? అధినేతకు ఒప్పించుకోలేక సతమతమవుతున్నారా? శాసనసభకు హాజరవుతున్నారా? హాజరైతే సభలో ఎందుకు కనిపించరు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. మంత్రి నారా లోకేష్ వైసీపీ ఎమ్మెల్యేల హాజరుపై మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ శపథం చేసిందని.. అప్పట్లో సభకు హాజరు కాలేదని.. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శపథం చేశారని.. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు వచ్చామని చెప్పి సంతకాలు పెడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టడం పై చర్చ ప్రారంభం అయింది. జగన్మోహన్ రెడ్డి మాత్రం తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు సభకు హాజరు కామంటున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ ప్రకటన పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
* అధినేతకు ఒప్పించలేక..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంఖ్యా బలంగా ప్రతిపక్ష హోదాకు( opposition status ) ఈ సంఖ్య సరిపోదు. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరవుతానని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్తున్నారు. అయితే ప్రతిపక్ష హోదా అనేది తాము ఇచ్చేది కాదని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. కోర్టుకు వెళ్లి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఇంకోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు హాజరు కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన రాజకీయ కారణాలు చెప్పి వారికి చెక్ చెపుతున్నారు. ఇటువంటి తరుణంలో ఏం చేయాలో వైసీపీ ఎమ్మెల్యేలకు పాలు పోవడం లేదు. అందుకే వారు అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నట్లు తెలుస్తోంది.
* ఆ కారణాలతోనే..
వాస్తవానికి వారంతా కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే. 11 మంది ఎమ్మెల్యేలు ఏడుగురు కొత్తగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఆపై ఆర్థికంగా అంత శ్రీమంతులు కూడా కాదు. సభలో అడుగుపెట్టి అధ్యక్షా అనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ తమ అధినేత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) మాత్రం తమను అదుపు చేస్తున్నారన్న బాధ వారిలో ఉంది. పోనీ కూటమి పార్టీలోకి జంప్ చేస్తామంటే అటు నుంచి ఆహ్వానాలు లేవు. అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటిస్తే అనర్హత వేటు పడుతుందన్న భయం వారిలో ఉంది. ఇంకోవైపు జీతభత్యాలు సైతం కోల్పోతారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటించలేక.. సభ లోపలికి వెళ్లలేక.. సంతకాలు పెట్టి వస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు డబుల్ గేమ్ ఆడుతున్నట్లు కూడా స్పష్టం అవుతోంది. కానీ జగన్ మోహన్ రెడ్డి ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఒకసారి శాసనసభ అధికారులకు కానీ.. సిబ్బందిని కానీ సంప్రదిస్తే ఎంతమంది వైసీపీ నేతలు వచ్చి సంతకం పెడుతున్నారు అన్నది తేలిపోనుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అంత సాహసం చేయడం లేదు. అలాగని తమ పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లి సంతకాలు పెడుతున్న విషయం ఆయనకు తెలియదు అని కూడా అనలేము.