Visakhapatnam summit 2025: విశాఖలో( Visakhapatnam) పెట్టుబడుల సదస్సు విజయవంతం అయింది. ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే వచ్చిన వారంతా ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ఆ సంస్థల ప్రతినిధులు కావడంతో ప్రభుత్వం చెబుతున్న దానికి కొంత నమ్మకం ఏర్పడుతోంది. పైగా పారిశ్రామికవేత్తలు ముందుగానే విశాఖకు చేరుకున్నారు. ఏర్పాట్లు చక్కగా చేశారు. ఒప్పందాల ప్రక్రియ సజావుగా పూర్తయింది. డ్రోన్ పైలెట్ ప్రాజెక్టు అదే వేదికపై శంకుస్థాపన కూడా చేశారు. దీంతో ఎక్కడ లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు పడ్డారు. లోపం జరిగి ఉంటే ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దానిని హైలెట్ చేసేది. ఆ పార్టీ నుంచి ఎటువంటి విమర్శలు సదస్సుపై రాకపోవడంతో దీనిని సక్సెస్ గానే భావిస్తున్నారు తటస్తులు. ఎందుకంటే ఎలాంటి అంశం పైన అయినా.. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పనిని తప్పు పట్టేది వైసిపి. అటువంటిది ఒక్క విమర్శ కూడా చేయకపోవడం మాత్రం విశేషం.
- సరిగ్గా ఎన్నికలకు ముందు..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలిసారిగా చంద్రబాబు( Chandrababu Naidu ) ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీకి భారీగా పరిశ్రమలు తెస్తేనే ఆదాయం పెరుగుదలతో పాటు యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా కృషి చేశారు. వరుసగా మూడుసార్లు పెట్టుబడుల సదస్సు కూడా ఏర్పాటు చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు చాలా పరిశ్రమలు ముందుకు వచ్చాయి. అందులో భాగంగానే అనంతపురం కియా పరిశ్రమ. అయితే అప్పట్లో ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలకు గ్రౌండ్ చేయడంలో ఆలస్యం అయింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు సర్కార్ అనుమతులను నిలిపివేయడంతో పరిశ్రమల ఏర్పాటుకు వీలు కాలేదు. అలాగని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏటా దావోస్ లో జరిగే ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు సైతం తూతూ మంత్రంగా హాజరైన సందర్భాలే అధికం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తో సంబంధం లేకుండా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. అది కూడా ఎన్నికలకు ముందే.
అప్పట్లో ఫెయిల్యూర్..
తాజాగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సదస్సు పై స్పందించేందుకు సైతం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ సాహసించడం లేదు. దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. 2023లో జగన్ సర్కార్ విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించింది. అయితే అందులో ఎక్కువగా లోకల్ పారిశ్రామికవేత్తలు, స్థానికంగా వ్యాపారాలు చేసుకునే వారిని రప్పించి.. వారితో ఖరీదైన కోట్లు వేయించి ఒప్పంద పత్రాలపై సంతకం చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు విశాఖ పెట్టుబడుల సదస్సుపై విమర్శలు చేసిన.. వ్యతిరేక ప్రచారానికి దిగిన.. నాడు వైసిపి హయాంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో జరిగిన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకే వైసిపి సోషల్ మీడియా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పైగా అప్పట్లో పెట్టుబడుల సదస్సు నిర్వహణలో కూడా జగన్ సర్కార్ ఫెయిల్ అయింది. అప్పట్లో భోజనాలు దొరకక చాలామంది ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఏర్పాట్లలో విజయవంతం అయింది కూటమి ప్రభుత్వం. దీంతో వైసీపీ విమర్శించేందుకు అవకాశం లేకుండా పోయింది.