YSRCP Rayalaseema: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధీమా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని.. పూర్వవైభవం ఖాయమని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వస్తే.. రాయలసీమలోనే ఏడు స్థానాలను దక్కించుకుంది. మూడు ఎంపీ సీట్లను సైతం కైవసం చేసుకుంది. అందుకే ఈసారి మెజారిటీ సీట్లు రావడం ఖాయమని అంచనా వేస్తోంది. కానీ రాయలసీమలో క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమ నేతల మధ్య సమన్వయం, సఖ్యత అంతగా లేనట్లు తెలుస్తోంది. దీంతో పార్టీకి పూర్వ వైభవం మాట పక్కన పెడితే.. గ్రాఫ్ సైతం తగ్గిపోతుంది అనేది కొత్తగా వినిపిస్తోంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ జరగడం ఖాయం.
* బలమైన నాయకులు ఉన్నా..
రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లోటు లేదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ వెంట మెజారిటీ నేతలు నడిచారు. అయితే వరుసగా రెండుసార్లు గెలిచేసరికి వారిలో ధీమా పెరిగింది. కానీ మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా గెలుస్తామని ఆ నేతలు భావిస్తున్నారు. అయితే పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారే మోనార్కు అని.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మంత్రి పదవులు ఖాయమని ఆశ పెట్టుకున్న వారు ఉన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని పట్టించుకోకుండా అంత జగన్ ప్రభంజనం వీస్తుందని కలలు కంటున్నారు.
* పట్టించుకోని ఇతర నేతలు..
రాయలసీమ వైసీపీలో వింత పరిస్థితి నడుస్తోంది. ఎవరైనా నాయకుడు ఇబ్బందుల్లో ఉంటే సహచరులు పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుంటే తమకేమీ పట్టనట్టుగా ఉంటున్నారు. అందుకే బాధిత నాయకులు బాధపడుతూ పార్టీ కార్యకర్తలకు దూరమవుతున్నారు. ఇలా ఉంటే పార్టీ నిలదొక్కుకోవడం రాయలసీమలో కష్టం అని క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ భావిస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రత్యర్థి పై గట్టిగానే పోరాటం చేస్తున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఆయనను తాడిపత్రిలో అడుగుపెట్టకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. అయితే ఈ విషయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వంటరి అని అర్థం అవుతోంది. కనీసం మిగతా వైసీపీ నేతలు కూడా ఆయనకు మద్దతు తెలపడం లేదు. అప్పుడప్పుడు ఒకరిద్దరు నేతలు వచ్చి సంఘీభావం తెలిపి వెళ్లిపోతున్నారు.
* తోపుదుర్తి ఒంటరి..
తాజాగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన వెంట ఏ వైసీపీ నాయకుడు కూడా లేకుండా పోయారు. వరుసగా ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. పోలీసుల అదుపులోకి తీసుకుంటున్న చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు అటు చూడడం లేదు. హై కమాండ్ సైతం చాలా లైట్ తీసుకుంటుంది. దీంతో రాయలసీమలో ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి. ఇలానే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ప్రభావం చూపే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


