NTR – YS Jagan : అవసరం ఎంత పనైనా చేయిస్తుందంటారు. ఎంతదాకైనా తీసుకెళుతుందంటారు. ఇప్పుడు ఏపీలో వైసీపీకి అటువంటి అవసరమే వచ్చింది. రాజకీయ అవసరంతోనే ఏకంగా ఎన్టీఆర్ నే స్తుతించాల్సిన పరిస్థితి వచ్చింది. సహజంగా నాయకుల పుట్టిన రోజుల నాడు రాజకీయ ప్రత్యర్థులు సైతం శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ. అదే దివంగత నాయకులకైతే వారి సేవలను కొనియాడుతూ ట్విట్ల సందేశాలు పంపడం ఇటీవల సర్వ సాధారణం. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకల వేళ వైసీపీ అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ ను ఎన్నడూ గౌరవించలేదు. కానీ జగన్ కు మాత్రం గౌరవించక తప్పని అనివార్య పరిస్థితి ఎదురైంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కరుడుగట్టిన కాంగ్రెస్ నేత. ఎన్టీఆర్ అదే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి తిరుగులేని నాయకుడయ్యారు. కాంగ్రెస్ విధానాలను నరనరాన జీర్ణించుకున్న వైఎస్సార్ కు ఇది మింగుడుపడని అంశం. పైగా రాయలసీమలో వైఎస్సార్ ఎదుగుదలకు అడ్డుతగిలిన నాయకుడు ఎన్టీఆర్. అటువంటి నాయకుడ్ని తన రాజకీయ జీవితంలో వైఎస్సార్ పెద్దగా గౌరవించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఆయన తనయుడు జగన్ అదే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించాల్సి రావడం ఓకింత చర్చనీయాంశమే.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అటు దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు సైతం వేడుకలు జరుపుకున్నారు. శత జయంత వేడుకల వేళ మహానాడు జరుపుకున్న టీడీపీ ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించింది. అయితే వైసీపీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదీ కూడా అధికారికంగా జరపడం కాస్తా విశేషం. అయితే ఆ కార్యక్రమం మొత్తం చంద్రబాబును తిట్టడానికే. అయినప్పటికీ వైసీపీ కూడా ఎన్టీఆర్ కు శత జయంతి ఉత్సవాలు నిర్వహించినట్లయింది.
విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలను ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి లీడ్ చేశారు. దీనికి
పోసాని కృష్ణమురళి, అలీ, రామ్ గోపాల్ వర్మ లాంటి వారు హాజరయ్యారు. కొడాలి నాని, పేర్ని నాని ధ్వయం సైతం హాజరయ్యింది. అయితే వీరంతా ఎన్టీఆర్ జయంతి వేడుకలకు హాజరైనట్టుగా లేదు. చంద్రబాబుపై ప్రెస్ మీట్ పెట్టిన మాదిరిగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు గురించి తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయించారు. ఆర్జీవీ అయితే మరీ ముందుకెళ్లిపోయారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి అతిగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మగాడు అన్నట్లుగా చెప్పారు. ఎందుకంటే మహానాడుకు హాజరు కానందుకట. నాడు ఎన్టీఆర్ పేరు ఎత్తేందుకే వైఎస్సార్ ఇష్టపడలేదు. అటువంటిది ఆయన జయంతి వేడుకలను కుమారుడు జగన్ అధికారికంగా నిర్వహించడం వెనుక.. ఎన్టీఆర్ లో ఏదో మేనియా ఉందన్న మాట.