YSR Congress party
YSR Congress: రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. కానీ స్థానిక సంస్థల్లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ పట్టు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దానికి చెక్ చెప్పాలని భావిస్తోంది టిడిపి కూటమి. అవిశ్వాస తీర్మానాల ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదవులను లాక్కోవాలని చూస్తోంది. అయితే దానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా సమాధానం చెబుతోంది. కొన్నిచోట్ల కూటమి ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లా పరిషత్ పీఠం విషయంలో పట్టు నిలుపుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే రాష్ట్రంలోనే అతిపెద్దదైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను చేజిక్కించుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తీయాలని చూస్తోంది కూటమి.
Also Read: పవన్ దూకుడు.. పిఠాపురంపై అనూహ్య నిర్ణయాలు!
* ఎట్టకేలకు ఆ అవకాశం..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై( greater Visakha Municipal Corporation) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అయితే నాలుగు సంవత్సరాల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం లేకపోవడంతో.. బలం కూడా తీసుకునే పనిలో పడింది. వైయస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్ లను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. అవిశ్వాస తీర్మానం గడువు ముగియడంతో కూటమి నేతలు పావులు కదిపారు. విశాఖ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. అయితే ఇట్టి పరిస్థితుల్లో గ్రేటర్ పీఠాన్ని వదులుకోకూడదని భావించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే తమ కార్పొరేటర్ లను హైదరాబాద్, బెంగళూరు క్యాంపులకు తరలించింది. అక్కడ సేఫ్ కాదనుకుంటే వారిని మలేషియా కూడా తరలించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
* కడపలో సక్సెస్
కడపలో ( Kadapa )క్యాంప్ రాజకీయాలతో సక్సెస్ అయ్యింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇప్పుడు విశాఖలో కూడా ప్రయోగం చేస్తోంది. అయితే ఎలాగైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలని కూటమి భావిస్తోంది. కూటమికి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లు పాస్పోర్ట్లు ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో కేవలం 25 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కూటమికి అవసరమైన కార్పొరేటర్ల సమీకరణ జరిగిపోయిందని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాకు చెక్ చెప్పడం ఖాయమని కూటమి పార్టీల వర్గాలు చెబుతున్నాయి.
* అంత ఈజీ కాదు
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 98 డివిజన్లకు గాను 58 చోట్ల విజయం సాధించింది. అప్పట్లో ఉన్న ఏకపక్ష బలంతో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. అయితే ఎన్నికలకు ముందు.. ఫలితాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరారు. అందుకే ఇప్పుడు అవిశ్వాసం పెట్టేందుకు కూటమి సిద్ధపడుతోంది. అయితే కడప తరహాలో విశాఖలో తప్పించుకోవడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.