Undavalli Arun Kumar: ఏపీలో( Andhra Pradesh) కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. రాజకీయంగా మరింత బలపడేందుకు ప్రయత్నిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ వైఫల్యాలను, తప్పులను ఎత్తిచూపుతూ పట్టు బిగుస్తోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ స్కామ్ లో ఇప్పటికే 12 మంది అరెస్ట్ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతగా భావిస్తున్న రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదని ప్రచారం సాగుతోంది. మరోవైపు పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. దీంతో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: ఏపీకి వాయు’గండం’.. పాఠశాలలకు సెలవులపై చంద్రబాబు కీలక నిర్ణయాలు
* రాజకీయాలకు దూరంగా ఉండవల్లి
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్( Undavalli Arun Kumar) . సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడుతుంటారు. తనదైన విశ్లేషణ చేస్తూ రాజకీయ మేధావిగా గుర్తింపు పొందారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. 2004, 2009 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి. 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. చాలా పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానాలు అందాయి. కానీ ఏ పార్టీలో చేరలేదు. అయితే రాజకీయ విశ్లేషకుడిగా ఉన్న ఆయన జగన్మోహన్ రెడ్డి విషయంలో చిన్నపాటి ఫేవర్ గా మాట్లాడతారన్న పేరు ఉంది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వం పై ఆయన విమర్శలు చేశారు. 2019 నుంచి 2024 మధ్య ఆస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయలేదన్న ఆరోపణ ఆయనపై ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనేక రకాల అనుమానాలకు తావిస్తోంది.
* ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన నేతలు
ప్రస్తుతం మద్యం కుంభకోణం( liquor scam ) కేసులో ఎంపీ మిధున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను కలిసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, వైసీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం వచ్చారు. జైలులో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దీంతో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఉండవల్లితో వైసిపి మాజీ ప్రజాప్రతినిధులు చర్చించి ఉంటారని తెలుస్తోంది. కూటమిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు తీసుకొని ఉంటారని సమాచారం.
* వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు..
గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసేవారు ఉండవల్లి అరుణ్ కుమార్. జగన్మోహన్ రెడ్డికి సైతం సలహాలు ఇచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే తాను రెండుసార్లు ఎంపీ అయ్యానని కృతజ్ఞతగా చెబుతుంటారు అరుణ్ కుమార్. సహజంగానే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు ఉండవల్లి. ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఆహ్వానించి ఉంటారని కూడా తెలుస్తోంది. అయితే ఏం చర్చించారు అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. దీనిపై ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి.