YSR Congress: మెగా ఫ్యామిలీ( mega family) విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. ఏకకాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పోస్టులు చూస్తే ఇది ఇట్టే అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై నెగిటివ్ ప్రచారం కొనసాగుతుండగా.. మెగాస్టార్ చిరంజీవి విషయంలో సానుకూల ప్రచారం మొదలు పెట్టింది. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం స్పష్టం అవుతుంది. మెగా ఫ్యామిలీ విషయంలో ఏ చిన్న పరిణామాలను విడిచిపెట్టడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కేవలం పవన్ కళ్యాణ్ ను ఒంటరి చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ముందుగా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు ఫ్యామిలీని వేరు చేయాలని చూశారు. అందులో కొంత సక్సెస్ అయ్యారు. కానీ దానితో లాభం కంటే వైసీపీకి నష్టమే జరిగింది. మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చారు అల్లు అర్జున్. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ తనకంటూ ఒక ప్రత్యేక స్టార్ డం రావడంతో మెగా కాకుండా అల్లు అన్నట్టు వ్యవహరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఓ వైసీపీ అభ్యర్థి స్నేహితుడు కావడంతో ఆయనకు మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్. అది మొదలు మొన్నటి అల్లు అర్జున్ నానమ్మ మరణం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
* అప్పట్లో రాజ్యసభ అంటూ ప్రచారం..
గతంలో మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అతిగానే చేసింది. ప్రత్యేకంగా ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి దంపతులు ఏకంగా చిరంజీవి దంపతులకు విందు ఇచ్చారు. ఆ సమయంలో ఎంతో వారి పట్ల గౌరవం ఉన్నట్లు చూపే ఫోటోలతో పాటు వీడియోలను సోషల్ మీడియాలో విడిచిపెట్టారు. అంతటితో ఆగలేదు. మెగాస్టార్ చిరంజీవి కి రాజ్యసభ పదవీ ఇస్తున్నట్లు కూడా లీకులు ఇచ్చారు. అయితే అదంతా పవన్ కళ్యాణ్ ను కట్టడి చేసేందుకే. అయితే తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో చిరంజీవి తమ వాడే అన్నట్టు భావిస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. చిరంజీవి అభిమానుల ముసుగులో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బాలకృష్ణ కేవలం గట్టిగా అడగలేదు జగన్మోహన్ రెడ్డికి.. అప్పట్లో అడిగే పరిస్థితి లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. చివరకు చిరంజీవికి సైతం అవమానం జరిగినట్లు మాట్లాడారు బాలకృష్ణ. అప్పటినుంచి చిరంజీవిపై అభిమానం ఉన్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
* రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై నెగిటివ్ ప్రచారం
కొద్ది రోజుల కిందట రామ్ చరణ్( Ram Charan) నటించిన ఓ చిత్రం విడుదలైంది. ఇదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా విభాగం ఆ చిత్రంపై నెగిటివ్ ప్రచారం చేసింది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం డిజాస్టర్ గా మిగలాలని ప్రయత్నం చేసింది. మెగా కుటుంబం పై తనకు ఉన్న అక్కసు ను బయటపెట్టింది. మంచి ఇతివృత్తంతో వచ్చిన గేమ్ చేంజర్ సినిమాపై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టింది వైసిపి సోషల్ మీడియా. అయితే ఇప్పుడు అదే వైసిపి మెగా కుటుంబంపై తమకు అభిమానం ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. దీనంతటికీ కారణం పవన్ కళ్యాణ్. అర్జంటుగా పవన్ బలహీనుడు కావాలి. కూటమి నుంచి జనసేన బయటకు రావాలి. కూటమి విచ్ఛిన్నం కావాలి. అందుకే చిరంజీవి అభిమానుల ముసుగులో పరకాయ ప్రవేశం చేశారు వైసీపీ శ్రేణులు. ఇది జన సైనికులతో పాటు మెగా అభిమానులు గుర్తించుకోవాల్సిన అంశం. లేకుంటే వైసీపీ ఆశించినట్టు జరగడం ఖాయం.