Anti-Hindutva stamp: అధికార పార్టీ చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఒక్కోసారి తప్పిదాలు వెంటాడుతాయి. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అదే తప్పిదాలు వెంటాడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉక్కిరి బిక్కిరి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. వైసీపీ హయాంలో అంతర్వేది రథం దగ్ధం అయ్యింది. రామ తీర్థాలు దేవస్థానంలో రాములోరి విగ్రహ దాడి జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. అయితే అప్పట్లో రథం స్థానంలో కొత్తది తెస్తాం.. కొత్త విగ్రహాన్ని పెట్టిస్తాం.. అంటూ వైసీపీ దూకుడు మంత్రులు ప్రకటనలు చేశారు. అంతేతప్ప ఆ ఘటనలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పలేదు. అటువంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. దాని పర్యవసానాలే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి హిందుత్వం రూపంలో వెంటాడుతున్నాయి. తిరుమల లడ్డు వివాదంలో వైసిపి పై అనుమానపు చూపులు అందులో భాగమే. జగన్మోహన్ రెడ్డి హిందుత్వ వ్యతిరేకి అన్న అనుమానాలకు బలం చేకూరే ఘటనలు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. వాటిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపకుండా.. అలానే విడిచి పెట్టడం ఇప్పుడు అదే వైసీపీకి శాపంగా మారింది.
విగ్రహాల ధ్వంసం..
విజయనగరం జిల్లా( Vijayanagaram district) రామతీర్ధాలు రాములోరి దేవస్థానం ప్రాంగణంలో.. వైసిపి హయాంలో రాముని విగ్రహం ధ్వంసానికి గురైంది. స్పష్టంగా అక్కడ రంపాలతో కోసిన ఆనవాళ్లు లభించాయి. అప్పట్లో పోలీసులు సైతం ఇది విధ్వంస చర్యగా ధ్రువీకరించారు. కానీ నిందితులను పట్టుకోవడంలో జగన్ సర్కారు విఫలం అయింది. అప్పట్లో టిడిపి నేతల అరెస్టు పర్వం కొనసాగింది. వారే నిందితులు అన్నట్టు ప్రభుత్వం వ్యవహరించింది. కానీ అందుకు సహేతుకమైన ఆధారాలను చూపించుకోలేకపోయింది. తరువాత ఆ కేసును మరుగున పడేసింది. విపక్షాల నుంచి నిలదీతలు, ప్రశ్నలు ఎదురైతే.. కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తామని, ఆలయం నిర్మిస్తామని.. అంతకుమించి ఎవరు ఏమి చేయగలరని వైసీపీ నేతలు అప్పట్లో ప్రకటనలు చేశారు. అంతర్వేది రథం దగ్ధం సమయంలో సైతం అదే తరహా ప్రకటనలు చేశారు. దాని స్థానంలో కొత్త రథం ఏర్పాటు చేస్తాం కదా అని చాలా సింపుల్గా చెప్పారు. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అనే ముద్ర పడడం ప్రారంభం అయింది.
జగన్మోహన్ రెడ్డిని నియంత్రించేందుకు..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జనవరి నుంచి జిల్లాల పర్యటనకు రానున్నారు. 2026 జూలైలో పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నారు. 2027 ద్వితీయార్థంలో పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి. ఈ క్రమంలోనే హిందుత్వ వాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే తిరుమల లడ్డు వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రధాన ఆరోపణపడింది. అందుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందానికి లడ్డు తయారీలో.. అనేక రకాల అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. ప్రధానంగా టీటీడీ అధ్యక్షుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి అనుచరుడు అప్పన్న ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు సీట్ గుర్తించింది. అయితే ఇప్పుడు ఆయనను అడ్డం పెట్టుకుని.. మొత్తం ఈ దర్యాప్తులో భాగంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదపడం ఖాయం. ఆధారాలు కూడా సేకరించడంతో 2029 ఎన్నికల నాటికి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందుత్వ వ్యతిరేక పార్టీగా ప్రమోట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.