YCP: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధికారానికి దూరమై రెండేళ్లు అవుతోంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు పూర్తయినా.. కొత్తవి వస్తున్నా.. అవి తమ క్రెడిట్ అన్నట్టు వ్యవహరిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తిరిగి క్రెడిట్ చోరీ అంటూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి తాము చేసింది చెప్పుకోలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఇదిగో మేం చేసాం అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఛలో మూలపేట పోర్ట్ అంటూ సౌండ్ చేసింది వైసిపి. టెక్కలి నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న ఈ పోర్టు నిర్మాణం తుది దశకు చేరుకుంది. కానీ తమ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం జరిగింది అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త వాదనను తెస్తోంది. తమ హయాంలోనే 70 శాతం పనులు జరిగాయని.. తమకి క్రెడిట్ ఇవ్వాలని కోరుతోంది. నిన్ననే ఆ పోర్టు వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వైసిపి నాయకులు గట్టిగానే సౌండ్ చేశారు.
* ఏడాదిలో 70% అట..
2023లో ఈ పోర్టు పనులను ప్రారంభించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అక్కడకు ఏడాది కాలంలోనే ఎన్నికలు వచ్చాయి. అయితే తాము దిగిపోయే నాటికి 70% పనులు పూర్తి చేశామని చెబుతోంది ఆ పార్టీ. ఏడాది కాలంలో 70 శాతం పనులు చేస్తే.. ఈ రెండేళ్ల కాలంలో 30% పనులు జరిగాయా అనే ప్రశ్న వినిపిస్తోంది. పైగా వైసీపీ హయాంకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పనులు వేగవంతం అయ్యాయన్న వాదన ఉంది. కానీ వైసీపీ ఆలోచన అదికాదు. ఈ పోర్టు నిర్మాణంలో తమ పార్టీ ముద్ర ఉండాలని బలంగా కోరుకుంటుంది. పైగా అదనపు భూసేకరణ అనే అంశం తెరపైకి వస్తే దానిని పట్టుకొని పోరాటం చేయాలని చూస్తోంది. తద్వారా టెక్కలి నియోజకవర్గంలో పాటు శ్రీకాకుళం జిల్లాలో పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. అందుకే ఉత్తరాంధ్ర నుంచి వైసిపి నేతలంతా ఈ కార్యక్రమానికి కదలి వచ్చారు.
* పక్కా వ్యూహంతోనే..
ప్రస్తుతం మూలపేట పోర్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దాదాపు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తిచేసి పోర్టు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సమాచారంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు పూర్తయ్యాక క్రెడిట్ కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రాజెక్టు ప్రారంభానికి ముందే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇది మా వల్లే సాధ్యం అయింది అని ప్రజల్లోకి సంకేతాలు పంపించగలిగింది. అయితే దీనిని కూటమి ధీటుగానే బదులిస్తోంది. ఈ క్రెడిట్ ఆరాటాన్ని ప్రజలు పట్టించుకోరని తేల్చి చెబుతోంది.