YSR Congress party
YSR Congress: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ముదురుతున్నాయి. ప్రస్తుతానికి ఎన్నికలు లేకపోయినా ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు. వీరిలో స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే నాలుగేళ్ల వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. కానీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి గడువు ముగియడంతో కూటమి పావులు కదుపుతోంది. స్థానిక సంస్థలపై వైయస్సార్ కాంగ్రెస్ పట్టు పోగొట్టేందుకు పెద్ద ఎత్తున అవిశ్వాస తీర్మానాలు పెట్టాలని భావిస్తోంది. ముందుగా రాష్ట్రంలోనే అతి పెద్దదైన గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దానికి ధీటుగా సమాధానం చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లో జీవీఎంసీపై పట్టు పోగొట్టుకోకూడదని భావిస్తోంది.
Also Read: తెలంగాణలో కొత్త మంత్రివర్గం.. బోలెడు ఆశలు ఆశయాలు
* కడపలో జాగ్రత్త పడిన జగన్
ఇప్పటికే కడపలో( Kadapa district జాగ్రత్త పడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈనెల 27న అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది. కానీ కూటమిపై అనుమానంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే తమ పార్టీకి చెందిన జడ్పిటిసి లను బెంగళూరు తరలించింది. ఈనెల 27న నేరుగా కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. అప్పటివరకు తమ పార్టీ జడ్పిటిసిలు ప్రలోభాలకు లొంగకుండా గట్టిగానే చర్యలు చేపట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు విశాఖలో అవిశ్వాస తీర్మానానికి కూటమి నేతలు కలెక్టర్ కు వినతి పత్రం అందించిన నేపథ్యంలో కడప ఫార్ములాను అనుసరిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* 2021 లో వైసీపీ ఘనవిజయం
2021 మున్సిపల్ ఎన్నికల్లో విశాఖలో ( Visakhapatnam) ఘన విజయం సొంతం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం 98 డివిజన్లకు గాను 58 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గొలగాని వెంకట హరి కుమారి మేయర్ గా ఎన్నికయ్యారు. ఆమె పదవి కాలానికి ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే ఎన్నికలకు ముందు.. ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరారు. ఇటీవల ఓ ఆరుగురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ గూటికి వచ్చారు. మరో ఆరుగురు వచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జాగ్రత్త పడింది. కార్పొరేటర్లు చేజారకుండా బెంగళూరు శిబిరాలకు తరలించే పనిలో పడింది. ఇప్పటికే చాలామంది కార్పొరేటర్లు బెంగళూరు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.
* కూటమికి చిక్కిన బలం
టిడిపి కూటమి( TDP Alliance ) ఇప్పటికే జీవీఎంసీలో పట్టు బిగించినట్లు ప్రచారం సాగుతోంది. మేయర్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైన బలం కూటమికి సమకూరిందని.. ఒకరిద్దరు కార్పొరేటర్లు చేరితే చాలని ప్రచారం సాగుతోంది. అప్పటివరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టరని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూటమి గూటికి చేరిన తరువాత.. తమకు తగినంత బలం ఉందని భావించిన తరువాత.. అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. అంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం శిబిరాలను కొనసాగించే అవకాశం లేదు. మొత్తానికి అయితే గట్టి షాక్ ఇచ్చేందుకు కూటమి ప్రయత్నాల్లో ఉండగా.. వైయస్సార్ కాంగ్రెస్ విరుగుడు చర్యలు చేపట్టింది. మరి అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.