https://oktelugu.com/

YS Viveka Death : వివేకా హత్యకు కారణం అదేనా

ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ గత నెల 31న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈనెల 3న సీబీఐ కార్యాలయంలో అవినాశ్ రెడ్డి విచారణకు హాజరైన క్రమంలోనే అరెస్ట్‌, విడుదల జరిగాయి.

Written By:
  • Dharma
  • , Updated On : June 12, 2023 / 10:11 AM IST
    Follow us on

    YS Viveka Death : వివేకానందరెడ్డి హత్య హై ప్రొఫైల్ కేసు. ఆయన మాజీ ఎంపీ, మాజీ సీఎం సోదరుడు. ప్రస్తుత సీఎం బాబాయ్.  గత నాలుగేళ్లుగా కేసు విచారణ కొనసాగుతుందే తప్ప నిందితులకు శిక్షపడలేదు. అనేక ట్విస్టులు కొనసాగుతూ వస్తున్నాయి. రాజకీయ కోణాలు, ఆస్తి వివాదాలే వివేకా హత్యకు పురిగొల్పాయని ప్రచారం జరిగింది. కానీ దేనిపైనా స్పష్టత లేదు. అయితే తమకు రాజకీయంగా అడ్డంకిగా ఉన్నారనే వివేకాను అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపై సీబీఐ ఆరోపణలు చేసింది. చార్జిషీట్లలో నిందితులు, సహ నిందితులుగా పేర్కొంది. వివేకా హత్య విషయం సీఎం జగన్ కు ముందే తెలుసునని కూడా పలుమార్లు పేర్కొంది.

    2019 మార్చి 15న వివేకా హత్యకు గురయ్యాడు. సీఎం జగన్ మేనిఫెస్టో తయారీతో పాటు అభ్యర్థుల జాబితా రూపొందిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డి అభియోగాలను ఎదుర్కొంటున్నారు. కేవలం కడప ఎంపీ సీటు కోసమే వివేకాను భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు అవినాష్ రెడ్డి హత్య చేయించారని సీబీఐ చెబుతూ వస్తోంది. అసలు దస్తగిరి అప్రూవర్ గా మారిన తరువాతే భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డిపై సీబీఐ గురి పెంచింది. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా చేసుకొని వారిద్దరిపై పట్టుబిగించింది. కేవలం దస్తగిరి వాంగ్మూలాన్ని ఎలా ప్రతిపాదికగా తీసుకుంటారని భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డి ప్రశ్నించినా లాభం లేకపోయింది.

    కేవలం కడప ఎంపీ సీటు కోసమే కాదు.. అంతకు మించి బలమైన కారణమే వివేకా హత్యకు పురిగొల్పి ఉంటుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అప్పటికే కడప సిట్టింగ్ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయనకు మరోసారి జగన్ చాన్స్ ఇవ్వదలచుకున్నారు. అటు వివేకానందరెడ్డి అడ్డుచెప్పినా జగన్ వినే పరిస్థితి ఉండదు. అటువంటప్పుడు అవినాష్ రెడ్డికి కానీ.. ఆయన తండ్రి భాస్కరరెడ్డికి కానీ.. వివేకాను ఎందుకు హత్యచేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పైగా హత్యలో ప్రమేయం ఉన్నవారిలో ఎక్కువ మంది సునీత, ఆయన భర్త రాజశేఖర్ రెడ్డి, ఆయన అన్న భానుప్రకాష్ రెడ్డికి సన్నిహితులే. అటువంటప్పుడు కేవలం రాజకీయ కోణంలో విచారణ చేపట్టాలని చూడడం సహేతుకం కాదన్న వాదన వినిపిస్తోంది.

    కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎనిమిదో నిందితుడు. సీబీఐ ఇటీవల అరెస్ట్‌ చేసి, 5 లక్షల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులను తీసుకొని వెంటనే విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ గత నెల 31న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈనెల 3న సీబీఐ కార్యాలయంలో అవినాశ్ రెడ్డి విచారణకు హాజరైన క్రమంలోనే అరెస్ట్‌, విడుదల జరిగాయి. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి.. తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి అరెస్ట్‌ అనంతరం తననూ అరెస్ట్‌ చేస్తారన్న ఆందోళనతో ఏదో ఒక కుంటి సాకు చెబుతూ విచారణకు గైర్హాజరవుతూ వచ్చారు.