YS Vijayamma: ఈరోజు మదర్స్ డే. అందరి తల్లులకు పిల్లలు శుభాకాంక్షలు తెలుపుతారు. తమకున్న అభిమానాన్ని చాటుకుంటారు. బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. కానీ అటువంటి మదర్స్ డే నాడే ఏపీ సీఎం జగన్కు షాక్ ఇచ్చారు వైయస్ విజయమ్మ. ఏకంగా కుమారుడిని కాదని కుమార్తెకు మద్దతు ప్రకటించారు. కుమారుడు నిలిపిన అభ్యర్థికి కాకుండా.. షర్మిలకు ఓటు వేయాలని కడప ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె జగన్కు తిరస్కరించినట్టే. ఇన్నాళ్లు ఆమె ఎలా ఉన్నా జగన్ పక్షమేనని అంతా భావించారు. వైసీపీ సైతం ఇదే తరహా ప్రచారం చేసింది. కానీ తాను కొడుకు పక్షం కాదని.. కూతురు పక్షమేనని తేల్చేశారు విజయమ్మ.
మొన్న ఆ మధ్యన మేమంతా సిద్ధం పేరిట జగన్ బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఇడుపాలపాయలో బస్సు యాత్ర ప్రారంభం కాగా విజయమ్మ కుమారుడ్ని ఆశీర్వదించి పంపారు.దీంతో ఆమె జగన్ వైపే ఉంటారని అంతా భావించారు. కానీ అక్కడకు కొద్ది రోజులకి షర్మిల సైతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అప్పుడు కూడా షర్మిలను ఆశీర్వదించిన విజయమ్మ… తాను ఇరువైపులా ఉంటానని సంకేతాలు పంపారు. తాను ఎన్నికల ప్రచారం కూడా చేయనని సంకేతాలు ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లిపోయారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రాకమునుపే జారుకున్నారు. అయితే దీనిపై ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకున్నారు. వైసీపీ అయితే తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంది. అయితే ఎన్నికల పోలింగ్కు 36 గంటల వ్యవధి ముందు విజయమ్మ కీలక ప్రకటన చేశారు. ఏకంగా వీడియో విడుదల చేశారు. కడపలో షర్మిల కు మద్దతు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లో తనను కాదని చెల్లెలు షర్మిలకు విజయమ్మ మద్దతు తెలపరని జగన్ భావించారు. కానీ ఈ తీవ్ర సంఘర్షణలో విజయమ్మ కుమార్తెకు అండగా నిలబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమికి అనుకూల పవనాలు వీస్తుండగా.. కడప జిల్లాలో సైతం జగన్ కు షర్మిల రూపంలో షాక్ తప్పదని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే తల్లి విజయమ్మ సైతం జగన్ కు గట్టి ఝలక్ ఇచ్చారు. మదర్స్ డే నాడే విజయమ్మ ఈ షాక్ ఇవ్వడం విశేషం.