YS Sharmila new controversy: షర్మిల ( Y S Sharmila ) మరోసారి తేనె తుట్టను కదిపారు. కూటమిని నిలదీసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ చర్యలను బయటపెట్టారు. రెండు రోజుల కిందట తిరుమలను సందర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రవ్యాప్తంగా టీటీడీ తరపున 5 వేల ఆలయాలు నిర్మిస్తామని ప్రకటించారు. దళిత వాడలతో పాటు ఎస్సీ కాలనీలో వాటిని నిర్మించడం ద్వారా సనాతన ధర్మంతో పాటు హిందూ సాంప్రదాయాలను విస్తరిస్తామని చెప్పుకొచ్చారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పిసిసి అధ్యక్షురాలు షర్మిల. దళిత వాడల్లో గుడులు కట్టడం ఏంటని నిలదీసినంత పని చేశారు. వాటిని రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేయవచ్చు కదా అని సలహా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో దీనిని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు, హిందుత్వవాదులు, స్వామీజీలు మండిపడుతున్నారు. షర్మిల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తున్నారు.
హిందూ ధార్మిక సంస్థ..
తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam) అనేది ఒక హిందూ ధార్మిక సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు, శ్రీవారి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. టీటీడీకి ప్రతి ఏటా వేలకోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. అదే సొమ్ముతో టీటీడీ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా దేవాలయాల నిర్వహణ, ఆసుపత్రుల ఏర్పాటు, సత్త్రాల నిర్మాణం వంటివి చేపడుతూ వస్తోంది. అందులో భాగంగానే దళితవాడలు, ఎస్సీ కాలనీల్లో ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ దానిని తప్పుపట్టారు. అదంతా ప్రభుత్వ సొమ్ముగా చెప్పుకొచ్చారు. సెక్యులరిజం ప్రభుత్వం నడుస్తోందని తీవ్ర పదజాలం వాడారు.
వైసీపీ హయాంలో ప్రాధాన్యం..
అయితే ఇప్పుడు షర్మిలపై హిందుత్వవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి( YSR Congress party) హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 25 వేల చర్చిలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మితమయ్యాయని ఆరోపిస్తున్నారు. వైసీపీ హయాంలో అన్యమత ప్రచారం పతాక స్థాయికి చేరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చర్చిలతో పాటు ముస్లిం ప్రార్థనలయాలకు భారీ ఎత్తున నిధులు కేటాయించడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన షర్మిల తీరు అలానే ఉంటుందని మండిపడుతున్నారు. అక్కడితో ఆగడం లేదు. ఆస్తి వివాదం నేపథ్యంలోనే అన్నను విభేదించారని.. బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారని.. ఇద్దరూ సంపాదించిన ఆస్తులు లక్షల కోట్లలో ఉంటాయని.. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించవచ్చు కదా? పేద ప్రజలకు ఉపయోగించవచ్చు కదా? అని డిమాండ్ చేస్తున్నారు. షర్మిల తాను వివాదం చేయడమే కాక.. అదే వివాదంలో తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిని సైతం తెస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. తద్వారా గత ప్రభుత్వ హయాంలో అన్యమత ప్రచారం, ప్రాధాన్యత ఎక్కువైందని చెప్పించే ప్రయత్నమా? అన్న అనుమానాలకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పై అదే ఆగ్రహాన్ని కొనసాగిస్తున్నారు షర్మిల. ఇప్పుడు హిందూ దేవాలయాలపై వ్యాఖ్యానించడం ద్వారా.. జగన్ చర్యలను గుర్తు చేసేలా ఆమె వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.