YS Sharmila: తను దూరడానికి సందు లేదు కానీ.. అన్నట్టు ఉంది ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల( AP Congress chief Sharmila) పిలుపు. ఏపీలో పార్టీ బాధ్యతలు తీసుకున్న ఆమె… పార్టీని ఎక్కడకో తీసుకెళ్తారని అంతా భావించారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇసుమంత బలం పెరగలేదు కానీ.. ఉన్న కొద్దిపాటి నాయకులు కూడా చేజారిపోయారు. ఇటువంటి సమయంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు షర్మిల. కాంగ్రెస్ లో చేరండి గొప్ప భవిష్యత్తు ఉందంటూ ప్రకటనలు ఇస్తున్నారు. బాధ్యతలు తీసుకున్నాక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సోదరుడు జగన్మోహన్ రెడ్డి పై విమర్శలకి ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. రండి రాహుల్ గాంధీని ప్రధాని చేద్దాం అంటూ పిలుపునిస్తున్నారు. అయితే షర్మిలపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి.
Also Read: జగన్ పై వాహన ప్రమాద కేసులో చర్యలన్నీ నిలిపేసిన కోర్టు
* YS Sharmila బాధ్యతలు తీసుకున్నాక బలహీనం తెలంగాణలో( Telangana) ప్రత్యేక పార్టీని పెట్టారు షర్మిల. అక్కడ వర్క్ అవుట్ కాకపోవడంతో.. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అందుకు బదులుగా ఏపీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని అంతా భావించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తన చరిష్మతో పార్టీకి ఒక ఊపు తెస్తారని అనుకున్నారు. అయితే కొత్తగా వచ్చిన బలం కంటే ఉన్న నాయకులు బయటకు వెళ్ళిపోయారు. ఓ ఐదారు సీనియర్ నేతలు ఉన్నా.. వారు సైతం షర్మిలను పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు షర్మిలపై కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నిత్యం ఫిర్యాదులు చేస్తూనే ఉంది. చాలా జిల్లాల్లో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో షర్మిల సైతం ఇబ్బంది పడుతున్నారు.
* రాజశేఖర్ రెడ్డి లక్ష్యం అదేనంటూ..
అయితే ఎప్పుడు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీతో పాటు సోదరుడు జగన్మోహన్ రెడ్డి పై విమర్శలకు పరిమితం అయిన షర్మిల ఇప్పుడు కొత్త స్లోగన్ అందుకున్నారు. రండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామంటూ పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యే అవకాశాన్ని దక్కించుకోండి అంటూ చెబుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా దివంగత రాజశేఖరరెడ్డి కృషి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతలను, కీలక నాయకులను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.