YS Sharmila: జాతీయస్థాయిలో కాంగ్రెస్ బలపడాలని చూస్తోంది. కానీ ఆ పార్టీకి పట్టు చిక్కడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ నుంచి ఒక ప్రయోగం చేయాలని చూస్తోంది కాంగ్రెస్. ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పేరు మార్చిన సంగతి తెలిసిందే. వలసల నియంత్రణకు గాను యూపీఏ 1 ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అనంతపురం జిల్లా బండ్లపల్లి లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అటువంటి పథకాన్ని పేరు మార్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ పథకాన్ని సమూలంగా మార్చారు. అయితే ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై జాతీయస్థాయిలో పోరాటం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఎక్కడైతే ఉపాధి హామీ పథకం ప్రారంభం అయ్యిందో.. అదే ఏపీలోని బండ్లపల్లి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ పోరాటం ప్రారంభించనుంది. ఇప్పుడు వస్తున్న ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం వచ్చి అదే బండ్లపల్లిలో పోరాటం చేయనుంది.
* దశాబ్దాల కాలం కిందట..
వలసలను నియంత్రించేందుకుగాను యూపీఏ 1 ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి వేతన దారుడికి వంద రోజులపాటు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దశాబ్ద కాలంగా ఈ పథకం నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరిట ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసింది. అయితే దేశవ్యాప్తంగా వివిధ పథకాలకు సంస్కరిస్తూ ముందుకు వెళుతోంది ఎన్డీఏ ప్రభుత్వం. అందులో భాగంగా ఉపాధి హామీ పని దినాలను 100 రోజుల నుంచి 125 దినాలకు పెంచింది. అయితే మిగతా విషయాల్లో చాలా రకాల సంస్కరణలను తెచ్చింది. దీనిని నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఈ పథకం ఎక్కడ ప్రారంభం అయ్యిందో అక్కడ నుంచి ఉద్యమం చేపట్టాలని చూసింది. అలా ఉమ్మడి అనంతపురం జిల్లాను వేదికగా చేసుకుంది. ఫిబ్రవరి 2న కాంగ్రెస్ అధినాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉమ్మడి అనంతపురం జిల్లాకు రానున్నారు. ఎక్కడైతే జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభం అయిందో.. అదే చోట నుంచి ఉద్యమం చేయాలని నిర్ణయించారు.
* పెద్ద టాస్క్..
అయితే ఈ నిర్ణయం పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు కఠిన పరీక్షగా మిగలనుంది. ఎందుకంటే ఆమె ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు. ఆపై వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆడపడుచు. త్వరలో ఆమెను మార్చుతారన్న ప్రచారం నడుస్తోంది. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా రాయలసీమ తరలివస్తోంది.. ఈ పర్యటన గాని సక్సెస్ కాకుంటే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం షర్మిల పట్ల ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అందుకే అందరి దృష్టి అనంతపురం జిల్లాలో ఫిబ్రవరి 2న కాంగ్రెస్ అధినాయకుల పర్యటనపై ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.