YS Sharmila: పదేళ్ల క్రితం.. మనీలాండరింగ్ కేసులో దివంగత ముఖ్యమంత్రి తనయుడు, నేడు ఏపీ ముఖ్యమత్రి అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో ఆయన సోదరి, నేడు ఏపీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల ‘నేను జగన్న వదిలిన బాణాన్ని’ అంటూ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టారు. అప్పటికే జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను కొనసాగించారు. వైఎస్సార్‌సీపీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక 2019 ఎన్నికల్లో బైబై బాబు.. అంటూ వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన నేత. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఆదరణ కరువైంది. అన్నా చెల్లెలు మధ్య విభేదాలు పొడచూపాయి. కారణం బయటకు రాకపోయినా ఇద్దరూ విడిపోయారు. 2021లో షర్మిల తెలంగాణకు వచ్చి వైఎస్సార్‌టీపీ పార్టీని స్థాపించారు. మూడేళ్లు పాదయాత్ర చేసినా పార్టీకి ఆశించిన ఆదరణ దక్కలేదు. షర్మిలను ఆంధ్రా నేతగానే తెలంగాణ ప్రజలు భావించారు. ఈ విషయాన్ని తొందరగానే గమనించిన షర్మిల.. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. ఆ సమయంలోనే పార్టీలో చేరి తెలంగాణలో పోటీ చేయాలని భావించారు. టీపీసీసీ చీఫ్, ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి షర్మిల చేరికను అడ్డుకున్నారు. ఆంధ్రాకు వెళితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. దీంతో వైఎస్సార్‌టీపీ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపింది.
కాంగ్రెస్‌లో చేరిక..
ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ సీఎం అయ్యారు. దీంతో షర్మిలకు లైన్ క్లియర్ అయింది. జనవరి 4న ఆమె తన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అధిష్టానం ఏ బాధ్యత అప్పగించిన నికార్సయిన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తానని ప్రకటించారు.
పీసీసీ పగ్గాలు అప్పగింత..
రాజశేఖరరెడ్డి చరిష్మా, ఆయన రాజసం ఉన్న ఆయన వంశాకురంతోనే 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో షర్మిల సారథ్యంలోనే వెళ్లాలని ఏఐసీసీ భావించింది. దీంతో ఏపీసీసీ పగ్గాలను ఆమెకే అప్పగించింది. జనవరి 15న షర్మిలను ఏపీసీసీ చీఫ్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో జనవరి 21న ఆమె పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో షర్మిల ప్రమాణం స్వీకరించారు చేశారు. ఈ ఎన్నికల్లో షర్మిలనే కాంగ్రెస్ తమ బ్రహ్మాస్త్రంగా భావిస్తోంది.
ఏపీసీసీ చీఫ్‌గా తొలి ప్రసంగం..
అనంతరం షర్మిల మాట్లాడారు. రెండుసార్లు ఏపీసీసీ అధ్యక్షుడిగా, రెండుసార్లు ఏపీ ముఖ్యమంత్రిగా తన తండ్రి వైఎస్సార్ పనిచేశారని గుర్తుచేశారు. వైఎస్సార్ బిడ్డగా తనకు ఈ బాధ్యతలు అప్పగించడం గర్వంగా ఉందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన కోసం చాలా మంది త్యాగాలు చేశారని, వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు వెల్లడించారు.
జగన్‌రెడ్డి అని సంబోధిస్తూ..
తర్వాత తన ప్రసంగంలో ఏపీలో పరిస్థితిపై మాట్లాడారు. గడిచిన పదేళ్లుగా ఏపీలో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి లక్ష కోట్లు అప్పులు వుంటే.. చంద్రబాబు రెండున్నర, జగన్‌రెడ్డి మూడు లక్షల కోట్లు అప్పులు చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఏపీ రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. పదేళ్లుగా రాజధాని లేదని, మెట్రే రాలేదని పేర్కొన్నారు. మూడు రాజధానులు తెస్తానన్న జగన్‌రెడ్డి ఒక్కటి కూడా కట్టలేదని విమర్శించారు. పట్టుమని పది పరిశ్రమలు కూడా తీసుకురాలేకపోయారన్నారు. రోడ్లు వేయడానికి కూడా ఏపీలో నిధులు లేవని తెలిపారు. ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా దోచుకోవడం, దాచుకోవడం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.