Homeఆంధ్రప్రదేశ్‌YS Rajasekhara Reddy Death Anniversary: వైఎస్ఆర్ వర్ధంతి: ఓ సంక్షేమ రారాజు అస్తమించిన రోజు

YS Rajasekhara Reddy Death Anniversary: వైఎస్ఆర్ వర్ధంతి: ఓ సంక్షేమ రారాజు అస్తమించిన రోజు

YS Rajasekhara Reddy Death Anniversary: ఏ రంగంలోనైనా.. కొంతమంది మహానుభావుల చరిత్రను లిఖించటానికి కొన్ని పేజీలు ఉంటాయి. అటువంటివారు భావితరాల్లో సైతం చెరగని ముద్ర వేస్తారు. అటువంటి లెజెండరీ లీడర్ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానేత. నిస్సత్తువలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకువచ్చిన మహా మనిషి ఆయన. సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టించిన జననేత కూడా ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు సిసలైన లీడర్. ఆయన మరణించి 16 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఆ మహానేత చేసిన మేలును మరువలేక పోతున్నారు. నేడు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

Also Read: కవితకు “సోషల్” బలం కావాల్సిందే

* చెరగని ముద్ర
వైయస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్య.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడు.. అంటూ ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అటువంటి మహానేత 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో.. నల్లమల అడవుల్లో ప్రాణాలు కోల్పోయారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం పూల పాన్పు కాదు. ఫ్యాక్షన్ రాజకీయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చినా.. ఆ నీడ పడకుండా సూపర్ పాలన అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలను ఎదుర్కొంటూ.. రాజకీయ ప్రత్యర్థులను ఢీకొడుతూ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిది.

* పేదల వైద్యుడిగా..
వైయస్సార్ కడప జిల్లా పులివెందులలో 1949 జూలై 8న జన్మించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి స్థానిక రాజకీయాల్లో ఉండేవారు. కుమారుడు రాజశేఖర్ రెడ్డిని చట్టసభలకు పంపించాలని భావించేవారు. అంతకుముందే వైద్యవృత్తిలో అడుగు పెట్టారు రాజశేఖర్ రెడ్డి. పులివెందులలో పేదల వైద్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. వైద్యవృత్తిని కొనసాగిస్తూనే 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. మంత్రిగాను పదవీ బాధ్యతలు చేపట్టారు. పులివెందులను కంచుకోటగా మార్చారు. వరుసగా ఐదు సార్లు అసెంబ్లీకి, నాలుగు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1994లో అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ.. 1999 లోను పరాజయం చవిచూసింది. అటు కేంద్రంలో సైతం కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అటువంటి సమయంలోనే 2003లో 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు రాజశేఖరరెడ్డి. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఆ హామీలన్నీ తాను అమలు చేస్తానని ప్రజలకు వాగ్దానం చేశారు. మండుటెండలో సైతం ఆరుపదుల వయసులో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను అర్థం చేసుకున్నారు. నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి కాకపోయినా.. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ హామీలన్నీ అమలు చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చిన గొప్ప నేత రాజశేఖర్ రెడ్డి.

* ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం..
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు రాజశేఖర్ రెడ్డి. వ్యవసాయ రంగానికి ఎంతగానో ప్రాధాన్యమిచ్చారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి ఫైల్ గా ఉచిత విద్యుత్ పై సంతకం చేశారు. 1100 కోట్ల వ్యవసాయ విద్యుత్తు బకాయిలను మాఫీ చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 వాహనాలు, 104 వాహనాలు, జల యజ్ఞం, వ్యవసాయ రుణాల మాఫీ.. ఇలా వినూత్న పథకాలతో ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే 2009లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేయగా.. టిడిపి నేతృత్వంలో మహాకూటమి ఒకవైపు.. ప్రజారాజ్యం పార్టీ ఇంకోవైపు గట్టిగానే ఎదుర్కొన్నాయి. అయినా సరే కాంగ్రెస్ పార్టీని ఒంటి చేతితో గెలిపించి చూపించారు రాజశేఖర్ రెడ్డి. రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అక్కడకు నాలుగు నెలల తరువాత.. అంటే సెప్టెంబర్ 2 ఉదయం 8:35 గంటలకు చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి గాను హైదరాబాదు నుండి బయలుదేరారు. 9.27 గంటల సమయంలో నల్లమల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్ప కూలిపోయింది. ఆ మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మృతితో ఉమ్మడి ఏపీ విషాదంలో మునిగిపోయింది. రాజశేఖర్ రెడ్డి భౌతికంగా దూరమై 16 సంవత్సరాలు అవుతున్నా.. ఆయన స్ఫూర్తి తెలుగు నేలపై కొనసాగుతూ వస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version