YS Jagan : మొన్నటివరకూ ఏపీ సీఎం జగన్ లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించేది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఎక్కడలేని ధీమా వ్యక్తమయ్యేది. కానీ ఆయన ఇటీవల భయపడుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఏ నిర్ణయాలు సక్రమంగా తీసుకోలేకపోతున్నారు. అటు ప్రజల్లో వచ్చేటప్పుడు పరదాల మాటున ప్రయాణాలు సాగిస్తున్నారు. భద్రత పేరుతో హడావుడి చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తరువాతే ఆయనలో భయం స్పష్టంగా తెలిసిపోతోంది. అప్పుడెప్పుడో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు లీకులిచ్చారు. ముగ్గురు మంత్రులను మార్చి పాత టిమ్ ను తేనున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ నెలలు గడుస్తున్నా అటువంటిదేమీ జరగలేదు.
ముందస్తు ఎన్నికలంటూ హడావుడి చేశారు. కానీ అందుకు ధైర్యం చేయలేకపోయారు. గత ఏడాది కాలంగా అదిగో ముందస్తు.. ఇదిగో మందస్తు అని చెప్పుకొచ్చారు. కేంద్రం సైతం సుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఢిల్లీ పెద్దలు గో హెడ్ అంటూ భుజం తట్టారని కూడా టాక్ నడిచింది. ఢిల్లీ నుంచే జగన్ కేబినెట్ భేటీకి ఆదేశాలివ్వడంతో ఇక ముందస్తే తరువాయి అన్నరీతిలో ప్రచారం సాగింది. కానీ కేబినెట్ భేటీ అయితే నిర్వహించారు. కానీ ముందస్తుపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
నిజానికి గత ఏడాది సెప్టెంబరులో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన అని వైసీపీ వర్గాలు లీకులిచ్చాయి. మంత్రి అప్పలరాజు స్థానంలో స్పీకర్ తమ్మినేనిని తీసుకుంటారని కూడా ప్రచారం చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని బాధ్యులు చేస్తూ మంత్రులను సమూలంగా మార్చేయనున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఒకానొక దశలో కేబినెట్ సమావేశంలో జగన్ తన కుటుంబంపై టీడీపీ ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని .. ఇలా అయితే ఇద్దరు, ముగ్గురు మంత్రుల్ని మార్చేస్తానని హెచ్చరించారు. ఆ మాటలు అన్న తర్వాతి రోజే ముగ్గురు మంత్రులకు ఉద్వాసన ఖాయమని లీకులు ఇచ్చారు. కానీ అదీ జరగలేదు.
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో.. మూడేళ్ల తర్వాత కేబినెట్ మంత్రులందరితో రాజీనామాలు తీసుకుని కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. అయితే అందులో పదకొండు మంది పాతవారికే అవకాశం కల్పించారు. అవకాశం లభించని వాళ్లని పేర్ని నాని, కొడాలి నాని లాంటి నోరున్న నేతలున్నారు. వారి ప్లేస్‌లో వమంత్రి పదవులు చేపట్టిన వారు సైలెంట్‌గా ఉంటున్నారు. పదవులు పీకేసినా వారే నోటికి పని చెప్పాల్సి వస్తోంది. మంత్రుల్లో గట్టి వాయిస్ ఉన్న వారు లేరు. అయితే ఇప్పుడు మంత్రివర్గాన్ని కదిలిస్తే లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నట్లేనని సీఎం జగన్ అనుకుంటున్నారు. ఇప్పటికే నెల్లూరు రెడ్లు దూరమయ్యారు. బాలినేని అలకబూనారు. అందుకే ఇప్పుడు తేనెతుట్ట కదిలించేందుకు జగన్ తెగ భయపడుతున్నారు.