YS Bharathi Reddy: రాజకీయ పార్టీల అధినేతలకు సొంత కుటుంబ సభ్యుల అండ ఉండాలి. ఒకరే రాజకీయం చేస్తామంటే కుదరదు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ తో పాటు బావమరిది నందమూరి బాలకృష్ణను తెచ్చుకున్నారు. ఆపై బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ కూడా ఉన్నారు. భార్య భువనేశ్వరి తో పాటు కోడలు బ్రాహ్మణి అవసరమైన పక్షంలో సాయం అందిస్తున్నారు. తమ్ముడు కుమారుడు నారా రోహిత్ కూడా అందుబాటులో ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ కు అండగా అవసరమైన ప్రతి చోట మెగా ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పటికే నాగబాబు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ సాధించాలంటే కుటుంబ సభ్యుల అండ అధినేతకు అవసరం. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన లోటు కనిపిస్తోంది. మొన్నటి వరకు తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడేవారు. కానీ ఇప్పుడు వారిద్దరూ దూరమయ్యారు.
జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంతా ఆయనకు అండగా నిలుస్తూ వచ్చింది. ఎంతలా అంటే ఆయన జైలుకు వెళ్లిన షర్మిల పాదయాత్ర చేశారు. విజయమ్మ అంతా తానై చూసుకున్నారు. కుటుంబంలో ప్రతి సభ్యుడు ఒక సైనికుడిలా పని చేశారు. 2019 ఎన్నికల వరకు అదే పరిస్థితి కొనసాగింది. కానీ ఆ కుటుంబంలో వ్యక్తిగత వివాదాలు చెలరేగాయి. విజయమ్మ పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కానీ సొంత పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి సొంత కుటుంబ సభ్యుల అండ అంటూ ఏమీ లేకుండా పోతోంది. నిజంగా అది ఆయనకు లోటు.
సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. 25 పార్లమెంటరీ స్థానాల పరిధిలో.. వారానికి ఒక పార్లమెంట్ స్థానంలో పర్యటించాలని చూస్తున్నారు. అలా ఒక ఆరు నెలల పాటు పార్టీ శ్రేణులతో గడపాలని భావిస్తున్నారు. తరువాత పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చి.. సమర్థులైన నేతలకు ఇన్చార్జి బాధ్యతలు కట్టబెడతారు. తరువాత ప్లీనరీ ఉంటుంది. పార్టీ మేనిఫెస్టో ప్రకటన కూడా ఉంటుంది. 2027 ద్వితీయార్థంలో పాదయాత్ర మొదలు పెడతారు. అంటే క్షణం తీరికలేని షెడ్యూల్ ఆయనది. ఇటువంటి సమయంలో కుటుంబ సభ్యుల అండ చాలా అవసరం. అందుకే తన భార్య భారతి రెడ్డిని రాజకీయాల్లోకి తెస్తారని ప్రచారం జరుగుతోంది. అవసరం అనుకుంటే కుమార్తెలను సైతం తెరపైకి తెస్తారని టాక్ నడుస్తోంది. 2029 ఎన్నికల్లో సర్వశక్తులు వడ్డాల్సి ఉంటుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తన భార్య భారతీ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?