YCP: ఏపీలో( Andhra Pradesh) కమ్యూనిస్టులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో జత కడతారా? అందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? రెండువైపుల నుంచి చర్చలు మొదలయ్యాయా? రెండు వైపులా ఇది ఆవశ్యమా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్డీఏలో తెలుగుదేశంతో పాటు జనసేన భాగస్వామ్య పక్షాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో బిజెపి ఉంది. వైసిపి ఒంటరి పోరాటం చేస్తోంది. జాతీయస్థాయిలో ఇండియా కూటమి లో కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో తటస్థ వైఖరి అనుసరిస్తోంది. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బిజెపి విషయంలో సానుకూలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటం కంటే వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడమే మేలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!
* సానుకూలంగా సిపిఎం..
అయితే గత కొన్ని సంవత్సరాలుగా సిపిఎం( CPM) జగన్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్న మధు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన అసలు పేరు మధుసూదన్ రెడ్డి గా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి బంధువు అవుతారని కూడా ప్రచారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో మధు అనారోగ్యానికి గురైతే పరామర్శించారు. అటు తరువాత సిపిఎం అనుబంధ పత్రికకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారీగా ప్రకటనలు కూడా వచ్చాయి. దీంతో గత పదేళ్లుగా జగన్ విషయంలో సిపిఎం పెద్దగా సౌండ్ చేయలేదు. కానీ సిపిఐ మాత్రం గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గట్టిగానే స్టేట్మెంట్లు ఇచ్చింది.
* ఆ నియామకం వెనుక..
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్( Y S Jagan Mohan Reddy ) పొత్తుల విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేయడం సాహసమే. అందుకే వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం మేలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య ఎంపికయ్యారు. దీని వెనుక పొత్తు స్నేహం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే బిజెపికి జగన్ సానుకూలంగా ఉంటారు. ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. అలాగే చంద్రబాబు పట్ల వామపక్షాలకు ఆ స్థాయిలో వ్యతిరేకతలేదు. కానీ ఇప్పుడు ఏపీలో రాజకీయ ఉనికి చాటుకోక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కంటే ఏపీలో వైసీపీ బలంగా ఉంది. అందుకే ఆ పార్టీతో స్నేహం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి వామపక్షాలు.
* ఇరు వర్గాలకు అనివార్యం..
అయితే ఇప్పటివరకు ఒంటరి పోరాటం అన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నినాదం. దమ్ముంటే ఒంటరిగా పోటీకి రండి అంటూ టిడిపి తో పాటు జనసేనకు సవాల్ విసురుతూ వస్తోంది వైసిపి. 2014, 2019 ఎన్నికల్లో ఇదే వామపక్షాలు ఉన్న జగన్ పట్టించుకోలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వామపక్షాల ఉద్యమాన్ని అణచివేశారు జగన్. అడుగడుగునా వారిని అవమానించారు. అటువంటి వామపక్షాలు ఇప్పుడు జగన్తో జతకలుస్తాయి అన్నది అనుమానమే. అయితే ఇప్పుడు పొత్తు ఇరువర్గాలకు అనివార్యం. ఆపై కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. అందుకే ఇప్పుడు ఆ రెండు పక్షాలు కలుస్తాయని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.