YS Jagan : వైసిపి అధినేత జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా?తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారా? సొంత పార్టీ శ్రేణులకు ఇది మింగుడు పడడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.జగన్ ఒకవైపు మొండిగా ముందుకు వెళుతుంటే..మరోవైపు కూటమి ప్రభుత్వం పక్క ప్లాన్ తో వెళ్తోంది. అవసరమైతే అనర్హత వేటు ఆలోచన చేయడానికి డిసైడ్ అయింది.ఏపీలో ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలుపడ్డాయి. 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులు సైతం పదవి బాధ్యతలు చేపట్టారు. తర్వాత అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమావేశానికి పులివెందుల ఎమ్మెల్యేగా విచ్చేశారు జగన్. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వెళ్ళిపోయారు. స్పీకర్ ఎంపికలు విపక్షానిది ప్రధాన పాత్ర. కానీ ఆ కార్యక్రమానికి సైతం ముఖం చాటేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కారణం చెబుతూ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతూ వస్తున్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడే జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈ అసెంబ్లీ సమావేశాలను సైతం బాయ్ కట్ చేశారు. 40 శాతం ఓటింగ్ దక్కించుకున్న తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు శాశ్వతంగా శాసనసభను బాయ్ కట్ చేస్తామని చెబుతున్నారు. అదే జరిగితే జగన్ తో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాదంలో పడినట్టే.
* ఆ విచక్షణాధికారంతో
నిబంధనల మేరకు ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీకి రాకుంటే.. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధించే అధికారం స్పీకర్ కు ఉంది.రాజ్యాంగం ఈ విచక్షణ అధికారాన్ని కల్పించింది. తెలంగాణలో సైతం ఇదే మాదిరిగా వ్యవహరించారు కేసీఆర్.అసెంబ్లీ ముఖం చూడలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సమయంలోనే అసెంబ్లీకి హాజరయ్యారు.తరువాత ముఖం చాటేసారు. కేవలం అనర్హత వేటు పడుతుందన్న భావనతో సరిగ్గా బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పుడు ఇది జగన్ కు కూడా వర్తిస్తుంది. కానీ ఇది తెలియని జగన్ మాత్రం శాశ్వతంగా అసెంబ్లీకి రానున్న రీతిలో వ్యవహరిస్తున్నారు.కనీసం పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు కూడా వినడం లేదు.అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుంటే ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వస్తుందని చెప్పినా..అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
* అన్నీ సొంత నిర్ణయాలే
పార్టీలో ఎటువంటి చర్చలు జరపకుండానే జగన్ సొంత నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని జగన్ నిర్ణయించుకున్నారు. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి ఈ విషయం తెలియదని తెలుస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరైతే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ మాత్రం వారిపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.అలాగే రెండు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం బహిష్కరించారు జగన్. కనీసం ఈ విషయంలో పార్టీలో చర్చలు జరపలేదని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒంటెద్దు పోకడలు.. ఇప్పుడు కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. జగన్ ఇలానే ముందుకు సాగితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. కానీ జగన్ మాత్రం వారి మాటలు వినే పరిస్థితిలో కనిపించడం లేదు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ycp wants to boycott the legislative assembly forever
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com