YCP Corporators : కూటమి వైపు స్థానిక సంస్థల వైసిపి ప్రతినిధులు.. విజయవాడకు తిరుపతి కార్పొరేటర్లు
వైసిపి ఉనికి మరింత ప్రమాదంలో పడనుంది. ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధుల పై వేటు పడనుంది. దీంతో వారంతా కూటమి పార్టీలో చేరేందుకు సిద్ధపడి పోతున్నారు.
YCP Corporators : స్థానిక సంస్థలకు సంబంధించి అవిశ్వాస తీర్మాన గడువు తగ్గింపు ప్రయత్నాల్లో కూటమి ఉంది. నాలుగు సంవత్సరాలను రెండేళ్లకు తగ్గించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమి పార్టీలవైపు వస్తున్నారు. తాజాగా తిరుపతికి చెందిన వైసిపి కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూటమిలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. కొందరు తెలుగుదేశంలో, మరికొందరు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్క తిరుపతి కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 కార్పొరేషన్లతో పాటు దాదాపు 100 వరకు మున్సిపాలిటీలపై కూటమి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జనసేనలో చేరేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అక్కడ అయితే నాయకులు తక్కువగా ఉండడంతో తమకు పోటీ ఉండదని భావిస్తున్నారు. స్వేచ్ఛగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అటు స్థానిక సంస్థల ప్రతినిధుల చేరికతో క్షేత్రస్థాయిలో పార్టీకి బలం పెరిగే అవకాశం ఉంది. అందుకే జనసేన సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
* జిల్లా పరిషత్తులు సైతం
ఉమ్మడి జిల్లాల పరిధిలో జిల్లా పరిషత్తులు కొనసాగుతున్నాయి. 13 జడ్పీలు వైసిపి చేతుల్లోనే ఉన్నాయి. అయితే చాలా నియోజకవర్గాల్లో జడ్పిటిసిలు కూటమి వైపు వచ్చారు. మరికొందరు చేరేందుకు సిద్ధపడుతున్నారు. అందుకే అవిశ్వాస తీర్మానం పాస్ అయితే.. చాలామంది జడ్పిటిసిలు కూటమి వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారితోపాటు చాలామంది జిల్లా పరిషత్ చైర్మన్లు, చైర్ పర్సన్ లు కూటమి వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వారు కూటమి పార్టీలోకి రాకుంటే అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే జరిగితే రెండేళ్ల పదవి కాలం వదులుకోవాల్సి ఉంటుంది.
* తిరుపతి కార్పొరేషన్ పై వ్యూహం
ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ను విడిచిపెట్టకూడదని కూటమి భావిస్తున్నట్లు సమాచారం. తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు ఓడిపోయారు. అయినా సరే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ మేయర్ గా కొనసాగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే షాడో మేయర్. అందుకే భూమన కుటుంబానికి తిరుపతిలో విలువ లేకుండా చేయాలంటే.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని.. మేయర్ తోపాటు డిప్యూటీ మేయర్లను గద్దె దించాలని కూటమి ఆలోచిస్తోంది. అందుకే వైసిపి నుంచి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతికి చెందిన మెజారిటీ కార్పొరేటర్లు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ఆ రెండు పార్టీల్లో చేరేందుకు ముహూర్తం నిర్ణయించారు. దీనిని వైసిపి ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.