Minister Gummidi Sandhya Rani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాత వాసనలు పోలేదు. తాము చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్టు పరిస్థితి ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా లో పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల తేదీల విషయంలో తాము చెప్పిన రోజుల్లో నిర్వహించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు అభ్యంతరాలు తెలిపారు. దీనిపై ఘాటుగా స్పందించారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల ముసుగులో వచ్చిన కొందరు మహిళలు మంత్రి ఎదుటే శాపనార్ధాలు పెట్టడం గమనార్హం. అమ్మవారు అంటూ సంబోధిస్తూ శాపనార్ధాలు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
* తేదీల మార్పు..
స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలను ఈనెల 11 నుంచి 12 వరకు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉత్సవ కమిటీ చైర్మన్ హోదాలో విశ్వేశ్వర రాజు ప్రకటించారు. మోదకొండమ్మ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే సభ్యులకు తెలియకుండానే ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు ఏకపక్షంగా తేదీలను ప్రకటించారు. పైగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతుండడంతో 11 నుంచి 12 తేదీల్లో పోలీసు బలాగాలు అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. ఈ పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ నివేదిక ప్రకారం తేదీలను మార్చారు. రెండు రోజుల కిందట జిల్లా ఇన్చార్జ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమీక్షించారు. 17 నుంచి మూడు రోజులపాటు మోదకొండమ్మ ఉత్సవాలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ నిర్ణయం పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు మంత్రి సంధ్యారాణితో వాగ్వాదానికి దిగారు. ఇష్టం వచ్చినట్లు తేదీలను ప్రకటిస్తే ఎలా అని.. మోదకొండమ్మ ఉత్సవాలు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రి సంధ్యారాణి. అయితే ఇంతలో కొందరు మహిళలు సంధ్యారాణి ముందుకు వచ్చి గిరిజనుల అమ్మవారితో పెట్టుకుంటున్నారు అని ఆక్షేపించారు. శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేయక గుమ్మిడి సంధ్యారాణి అడ్డుకున్నారు.. తాను కూడా గిరిజన మహిళనని గుర్తు చేశారు. రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న మోదకొండమ్మ ఉత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు.
* రాష్ట్ర గిరిజన జాతరగా..
రాష్ట్ర విభజన తర్వాత మోదకొండమ్మ ఉత్సవాలను రాష్ట్ర గిరిజన జాతరగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. మోదం అంటే సంతోషం. భక్తులకు సుఖసంతోషాలను ప్రసాదించే తల్లి మోదకొండమ్మగా విశ్వసిస్తారు స్థానిక ప్రజలు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం గా పేర్కొంటారు. ఏటా వేసవిలో మూడు రోజులపాటు ప్రత్యేకంగా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేలాదిమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించింది ప్రభుత్వం. అయితే ఈ ఏడాది తేదీల నిర్వహణలో వివాదం నెలకొంది. అయినా సరే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.