YS Sharmila: వైఎస్ షర్మిల పై వైసీపీ దాడి తీవ్రతరం చేసింది. ఇక ఉపేక్షించకూడదని భావిస్తోంది. ఆమెకు అవకాశం ఇస్తే ఇంకా ఇబ్బంది పెడతారని అంచనా వేస్తోంది. అందుకే తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది. అవసరమైతే క్రిమినల్ కేసు కూడా పెట్టాలని భావిస్తోంది. తన తండ్రి రాజశేఖరరెడ్డి భావించినట్టుగా, కోరుకున్నట్టుగా కుటుంబ ఆస్తుల పంపకాలు జరగలేదన్నది షర్మిల ప్రధాన ఆరోపణ. తన తండ్రి బతికున్నప్పుడు నలుగురు మనవళ్లు, మనవరాలు సమానమేనని… అందరికీ సమానంగా వాటా పంచాలని కోరుకున్నారని.. ఇంతలోనే చనిపోయారని షర్మిల చెబుతున్నారు. తన తండ్రి మరణం తర్వాత గార్డియన్ గా ఉన్న సోదరుడు జగన్ మాట మార్చారని.. ఆస్తి పంపకాల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించారని షర్మిల ఆరోపిస్తున్నారు. అంతకుముందు సరస్వతి పవర్ పరిశ్రమ షేర్ల విషయంలో తన తల్లి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. తన సోదరి పేరుతో షేర్లు బదలాయించారని.. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు జగన్. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయింది. షర్మిల, జగన్లు పరస్పర లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. తనను మానసికంగా హింసిస్తున్నారని.. క్షోభకు గురి చేస్తున్నారని జగన్ మండిపడుతున్నారు. తాను ఇవ్వాల్సిన ఆస్తిని ఇచ్చేశానని.. 200 కోట్ల రూపాయల ఆస్తిని ముట్ట చెప్పానని కూడా చెబుతున్నారు. అయితే దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు షర్మిల. తనకు ఆస్తులపై ఆసక్తి లేదని.. వారు హింసించడంతో ఆ ఆశ కూడా లేకుండా పోయిందని చెబుతున్నారు. వైయస్ కుటుంబ అభిమానులకు మూడు పేజీల లేఖ కూడా రాశారు షర్మిల.
* వరుసగా నేతల స్పందన
అయితే షర్మిలపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు వైసీపీ నేతలు. తొలుత మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. షర్మిల వెనుక రాజకీయ దుష్టశక్తులు ఉన్నాయని.. జగన్ రాజకీయ ప్రత్యర్థులతో ఆమె చేతులు కలిపారని ఆరోపించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. జగన్ సర్వనాశనాన్ని షర్మిల కోరుకుంటున్నారని.. పెదరాయుడులో రజనీకాంత్ పాత్ర జగన్ పోషిస్తున్నారని.. తన యావదాస్తిని సోదరి కోసం ఇచ్చేందుకు సిద్ధపడ్డారని… కానీ షర్మిల మాత్రం వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మీ పాత్రను కోరుకుంటున్నారని… అన్నను పొడిచి సర్వనాశనం చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇందులో విజయమ్మ పావుగా మారారని.. ఎన్నికలకు ముందు వీడియో విడుదల చేసి వైసిపి తో పాటు జగన్ ను సర్వనాశనం చేశారని గుర్తు చేశారు.
* క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరిక
మరోవైపు ఈ వివాదంపై వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. జగన్ ను కేసులపరంగా ఇబ్బంది పెట్టాలన్న కోణంతోనే షర్మిల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈడి అటాచ్ లో ఉన్న కంపెనీకి సంబంధించి షేర్లను ఎలా బదలాయిస్తారని ప్రశ్నించారు. క్రిమినల్ కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని.. అందుకోసమే జగన్ ను ఇబ్బంది పెట్టేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. షర్మిల వ్యవహార శైలి పై ఇకనుంచి ఉపేక్షించేది లేదని.. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సజ్జల సూచించారు. మొత్తానికి అయితే షర్మిల విషయంలో ఉదాసీన వైఖరి తగదని వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ycp target fix on sharmila
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com