YCP: గత ఐదేళ్ల పాలనలో ఏం చేశారని అడిగితే… వైసిపి నేతలు సమాధానం చెప్పేందుకు తటపటాయిస్తున్నారు. కానీ ఎదురు దాడిని మాత్రం కొనసాగిస్తున్నారు. చివరికి సినిమాల్లో వచ్చిన దృశ్యాల్లో విమర్శలను ఆపాదించుకొని కళాకారులను తిట్టుకునే స్టేజ్ కి వచ్చారు. తాజాగా ఓ వెబ్ సిరీస్ నటుడు యధాలాపంగా చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తిట్ల దండకం అందుకున్నారు. ఆ నటుడినే కాదు.. కుటుంబ సభ్యులపై సైతం దుమ్మెత్తి పోశారు. చివరకు బాధిత నటుడు క్షమాపణ చెప్పేంత వరకు ఊరుకోలేదు.
# 90s వెబ్ సిరీస్ తో మౌళి అనే యువ నటుడు మంచి ఆదరణ దక్కించుకున్నాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన చిన్నపాటి స్కిట్ వైసిపి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యేలా చేసింది. నలుగురిని నవ్వించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మౌళి రాజధానిని మాయం చేశానని జోక్ వేశాడు. అప్పటినుంచి వైసిపి సోషల్ మీడియా రెచ్చిపోయింది. బూతులతో తిట్ల దండకం అందుకుంది. ఒక్క మౌళి ని కాదు. ఆయన అమ్మా, నాన్నలను కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టడం ప్రారంభించారు. దీంతో భయపడిపోయిన మౌళి క్షమాపణ చెబుతూ ప్రత్యేక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. తన తల్లిదండ్రులను ఇందులో లాగవద్దని ప్రాధేయ పడాల్సి వచ్చింది. ప్రజలను నవ్వించడంలో భాగంగానే అలా చేశానని.. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదని చెప్పడంతో వైసిపి సోషల్ మీడియా కాస్త వెనక్కి తగ్గింది.
అసలే ఎన్నికల సీజన్. రాజధాని అంటేనే వైసీపీ నేతలు చిర్రెత్తిపోతున్నారు. ఎన్నికల ప్రచారానికి ఏ ముఖం పెట్టుకొని వెళ్తామని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి సమయంలోనే సోషల్ మీడియాలో రాజధాని ఇష్యూ పెద్దగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనికి ఊతమిస్తూ తటస్తులు, కళాకారులు ఎటువంటి కామెంట్స్ చేసినా తట్టుకోలేకపోతున్నారు. కొద్ది రోజుల కిందట ఏపీలో మద్యం పై ఓ నటుడు చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు మౌళి కామెంట్స్ సైతం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో వైసీపీ సోషల్ మీడియా ఎదురుదాడికి సిద్ధపడింది. అయితే ఈ క్రమంలో మౌళి కామెంట్స్ కంటే.. అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా చేసిన అతి వైసిపికి నష్టం చేసింది.