YCP Rowdy Batch: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో సమూల మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే ఆ పార్టీలో క్రమశిక్షణ కట్టు దాటుతోంది. ఈ విషయంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నారు. ప్రజలు దూకుడు తనాన్ని సహించరని తేలిపోయింది. ముఖ్యంగా బూతులతోపాటు కొందరి వ్యవహార శైలి వల్ల పార్టీకి నష్టం ఏర్పడింది. ఇప్పటికీ అదే జరుగుతోంది. జగన్ పుట్టినరోజు నాడు కొంతమంది వైసీపీ నేతల వికృత చేష్టలు పార్టీకి నష్టం చేకూర్చాయి. జగన్మోహన్ రెడ్డి చిత్రపటం ఎదుట ఏకంగా పశువులను వధించారు. ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డికి అభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరోచోట అయితే పుట్టినరోజు వేడుకలతో అసౌకర్యానికి గురైనందుకు ఓ గర్భిణి అభ్యంతరం వ్యక్తం చేయగా కాలితో తన్నాడు ఓ వైసిపి యువ నేత. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించడంతో పోలీసులు సరైన ట్రీట్మెంట్ ఇచ్చారు సదరు యువకుడికి.
అత్యుత్సాహంతో..
శ్రీ సత్యసాయి( Sri Sathya Sai ) జిల్లా కదిరి పట్టణంలోని ముత్యాల వాండ్ల పల్లి లో ఆదివారం జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ వీధిలో హంగామా సృష్టించాయి. కేకు కోసి.. బాణాసంచా కాలుస్తూ అరుపులు, కేకలతో హంగామా చేశారు. అయితే సమీపంలో నివాసం ఉంటున్న ఏడు నెలల గర్భిణి సంధ్యారాణి వద్దని వారించడంతో.. అక్కడున్న వైసీపీ నేతలు కోపంతో ఊగిపోయారు. ఆ పార్టీ కార్యకర్త అజయ్ దేవ్ ఆమెపై దాడి చేశాడు. గర్భిణీ అన్న కనికరం లేకుండా ఆమె జుట్టు పట్టుకుని లాగి కడుపుపై కాలితో తన్నాడు. గాయాల పాలైన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నడిపించుకుంటూ తీసుకెళ్తూ..
సోమవారం రంగంలోకి దిగారు కదిరి పోలీసులు. డీఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో నిందితుడు అజయ్ దేవ్ ని అరెస్టు చేశారు. నిందితుడిని కదిరి పట్టణమంతా ప్రధాన వీధుల గుండా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనంతపురం జిల్లాలో ఓ వైసీపీ సర్పంచ్ ఇదే మాదిరిగా జగన్ చిత్రపటం ముందు పశువధ చేసి రక్తాభిషేకం చేశారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇదే మాదిరిగా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అయితే పోలీసుల అరెస్టుకు సహేతుకమైన కారణం ఉంది. దీనిపై రాజకీయం చేయకుండా.. పార్టీలో అటువంటి స్వభావం ఉన్న వారిని దూరం పెడితే మంచిది.