Marri Rajasekhar: తెలుగుదేశం ( Telugu Desam)పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ( Mari Rajshekar )చేరిక దాదాపు ఖరారు అయింది. చిలకలూరిపేటకు చెందిన రాజశేఖర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా పని చేశారు. కానీ ఇటీవల ఆయనకు తగినంత గుర్తింపు లభించడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఇటీవల గుంటూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశానికి ఆయన హాజరు కాలేదు. అధినేత జగన్మోహన్ రెడ్డి జరిపిన రివ్యూకు సైతం ముఖం చాటేశారు. దీంతో మర్రి రాజశేఖర్ పార్టీని విడిచిపెట్టడం ఖాయమని తేలిపోయింది. అయితే ఆయన టిడిపిలో చేరితే మాత్రం ఆ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. పార్టీలో విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయనను టిడిపిలో చేర్చేందుకు ఓ ఎంపీ విశ్వప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అదే అధికార పార్టీలో విభేదాలకు కారణం అవుతున్నట్లు సమాచారం.
* పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు..
వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు మర్రి రాజశేఖర్. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ ఓడిపోయారు. ప్రత్తిపాటి పుల్లారావు గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే 2014 నుంచి 2019 మధ్య పార్టీ అభివృద్ధికి కృషి చేశారు రాజశేఖర్. కానీ అప్పటివరకు ప్రతి పార్టీ పుల్లారావు అనుచరురాలుగా ఉన్న విడదల రజినీకి వైసీపీ లోకి రప్పించారు. టికెట్ ఇచ్చారు. మర్రి రాజశేఖర్ కు జగన్మోహన్ రెడ్డి సముదాయించారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ని చేసి.. ఆపై మంత్రివర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రజినీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాజశేఖర్ కు కేవలం ఎమ్మెల్సీ పదవిని పరిమితం చేశారు.
* మంత్రి పదవి ఇస్తామని చెప్పి..
2024 ఎన్నికల్లో టికెట్ ఆశించారు రాజశేఖర్. కానీ జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) మాత్రం వేరే వ్యక్తికి అవకాశం ఇచ్చారు. విడదల రజినీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పంపించారు. కనీసం మర్రి రాజశేఖర్ పేరును పరిగణలోకి తీసుకోలేదు. అప్పటినుంచి తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు రాజశేఖర్. చిలకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు గెలిచారు. ఆయన సైతం ఈసారి మంత్రి పదవి ఆశించారు. దక్కకపోయేసరికి కాస్త అసంతృప్తికి గురయ్యారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి పెద్దగా అందుబాటులో ఉండడం లేదని టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పావులు కదిపినట్లు తెలుస్తోంది. ప్రత్తిపాటి పుల్లారావు వ్యవహారం భవిష్యత్తులో ఎలా ఉంటుందోనన్న అనుమానంతో.. పార్టీ హై కమాండ్ మర్రి రాజశేఖర్ ను టిడిపిలోకి రప్పించే బాధ్యతలను లావు శ్రీకృష్ణదేవరాయలకు అప్పగించినట్లు సమాచారం. అయితే టిడిపిలోకి మర్రి రాజశేఖర్ చేరికను ప్రత్తిపాటి పుల్లారావు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ టిడిపిలోకి వస్తే మాత్రం పార్టీతోపాటు కమ్మ సామాజిక వర్గంలో చీలిక రావడం ఖాయం.
* ప్రత్తిపాటి లో తీవ్ర ఆగ్రహం
వాస్తవానికి ఈ ఎన్నికల్లో ప్రతి పాటి పుల్లారావు కు ( prathipatti Pulla Rao )టికెట్ ఇవ్వరని ప్రచారం నడిచింది. 2019 ఎన్నికల్లో ప్రతిపాటి పుల్లారావు పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండేవారు. సరిగ్గా ఎన్నికలకు ముందు యాక్టివ్ అయ్యారు. అయితే టిక్కెట్ వేరొకరికి ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా వచ్చినట్లు ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో ప్రతిపాటి పుల్లారావు దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే మంత్రి పదవి దక్కకపోయేసరికి ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారట. అయితే వచ్చే ఎన్నికల నాటికి పుల్లారావు వ్యవహార శైలి ఎలా ఉంటుందో అని తెలియక.. పార్టీ హైకమాండ్ రాజశేఖర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే పార్టీలో ఆయన చేరికతో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.