AP Assembly Elections Results 2024: వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. భారీ విజయం దిశగా టిడిపి కూటమి దూసుకెళ్తోంది. తుది ఫలితాలు బయటకు వస్తున్నాయి. టిడిపి కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందుతున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థులు ఆశలు వదులుకుంటున్నారు. చాలామంది కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు కౌంటింగ్ జరుగుతుండగానే.. కేంద్రాలను విడిచిపెట్టి వెళుతుండడం గమనార్హం.
గత ఐదేళ్లుగా వైసిపి సాగించిన అరాచక పాలనకు మూల్యం చెల్లించుకున్నారు. దాదాపు క్యాబినెట్ మంత్రులంతా ఓటమి బాటలో ఉన్నారు. ఒక్క జగన్ మినహాయించి సీనియర్ మంత్రులంతా ఓటమి దిశగా పయనిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు మంత్రులంతా ఓడిపోతుండడం ఆ పార్టీ స్వయంకృతాపమే. ప్రస్తుతం వైసీపీ కేవలం 17 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉంది. అయితే 18 సీట్లు తగ్గితే ప్రతిపక్ష హోదా కోల్పోయినట్టే. ఈ లెక్కన వైసిపి డేంజర్ జోన్ లో ఉంది. అదే సమయంలో ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించనుంది. రెండు చోట్ల ఓడిపోయారంటూ పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలు, అవమానాలకు ఇది ఒక గుణపాఠమే.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 చోట్ల విజయం సాధించింది.అయితే అందులో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీంతో ఆ పార్టీ బలం 19 కి పడిపోయింది. మరో ఇద్దరి ఎమ్మెల్యేల కోసం వైసిపి ప్రయత్నించింది. దీంతో టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ప్లాన్ చేసింది. ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టింది. కేసులతో వెంటాడింది. అయినా ఎవరూ లొంగలేదు. జగన్ బెదిరింపులకు భయపడలేదు.దీంతో గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు అదే వైసిపి ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష హోదాకు కూత వేటు దూరంలో నిలిచిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కుతుందా? లేదా? అనేది తుది ఫలితాలు వచ్చాక తేలనుంది.