Pawan Kalyan: వైసీపీతో పవన్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? ఆ పార్టీ బలహీనతను బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఎన్నికల్లో చావు దెబ్బ తీయాలని భావిస్తున్నారా? అందుకే నియోజకవర్గాలను మార్చుతూ.. పిఠాపురం ను బయటపెట్టారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఇవి అంటూ చాలా ప్రచారం జరిగింది. గాజువాక, భీమవరం, తిరుపతి.. ఇలా మూడు నియోజకవర్గాలపై సంకేతాలు ఇచ్చారు పవన్. చివరకు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఈ విషయంలో జనసైనికులకు ఎటువంటి అనుమానాలు లేకున్నా.. వైసిపి శ్రేణుల్లో మాత్రం కొంత అయోమయం కనిపిస్తోంది.
పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడించాలని వైసిపి భావిస్తోంది. అష్టదిగ్బంధం చేసి ప్రజాభిప్రాయాన్ని మార్చాలని చూస్తోంది. పవన్ నోటి నుంచి పిఠాపురం అన్న మాట వచ్చిన మరుక్షణం తన యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించింది. ఏకంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన సైన్యంతో మోహరించారు. అటు వ్యూహాత్మకంగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. పిఠాపురం లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, టిడిపి, జనసేన నాయకులను వైసీపీలోకి రప్పిస్తున్నారు. అటు పంపకాలపర్వం సైతం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గతంలో గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయల నగదు ఏరులై పారింది.ఇక్కడ కూడా అదే మాదిరిగా నగదు పంపకాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చే పనిలో పడింది వైసిపి.
మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యూహం మార్చారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెబుతూనే.. కాకినాడ ఎంపీ సీటు గురించి కూడా ప్రస్తావించారు. పవన్ పోటీ చేస్తే పిఠాపురంలో లక్ష ఓట్ల మెజారిటీ ఖాయం అని జనసేన శ్రేణులు ఫిక్స్ అయ్యాయి. ఇప్పటికీ అక్కడ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు.అక్కడినుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ పవన్ వ్యూహాత్మకంగా పిఠాపురం ఎంచుకున్నారు. ఉదయ్ తనకోసం ఎంతో త్యాగం చేశారని చెబుతూ ఆయనకు కాకినాడ ఎంపీ టికెట్ ను ఆఫర్ చేశారు.
అయితే ఇక్కడే పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వైసీపీతో మైండ్ గేమ్ ఆడినట్లు బయటపడుతోంది. ఎమ్మెల్యే తో పాటు ఎంపీగా పోటీ చేయాలని కేంద్ర పెద్దలు సూచించినట్లు పవన్ స్వయంగా ప్రకటించారు. అంటే ఆయన ఎంపీగాను పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకున్న వైసిపి కోట్లాది రూపాయలు కుమ్మరిస్తోంది. ఒకవేళ పవన్ ఎంపీగా పోటీ చేస్తే వైసీపీకి వృధా ప్రయాస తప్పదు. అయితే పవన్ ప్రకటనలు చూస్తే మాత్రం వైసీపీని కన్ఫ్యూజన్లో పెట్టే వ్యూహంగా తెలుస్తోంది. గత అనుభవాల దృష్ట్యా వైసీపీ ఎలా వ్యవహరిస్తుందో పవన్ కు తెలుసు. అందుకే వైసిపికి విరుగుడుగా పవన్ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతుండడం విశేషం.