Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ప్రచారాలను ప్రారంభించాయి. ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ఉన్న ఏ అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. సంక్షేమ పథకాలపై అధికార పార్టీ ప్రచారం చేసుకుంటుండగా.. ప్రభుత్వ వైఫల్యాలను విపక్షాలు ఎండగడుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పనక్కర్లేదు. నేరుగా జగన్ సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధించడంలో ముందుంటారు. తాజాగా ఆయన సినిమాకు సంబంధించి ఒక గ్లింప్స్ విడుదల చేశారు. దానిలో గాజు గ్లాస్ డైలాగ్ ఉంది. ఆయన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఒక్క గ్లింప్స్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ డైలాగు విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఎన్నికల ముంగిట అటువంటి డైలాగ్ పెట్టడంతో పవన్ చిత్రానికి ఇబ్బందులు తప్పవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దానిని ప్రచారం కింద భావిస్తే మాత్రం.. అది కచ్చితంగా సమస్య అయ్యే అవకాశం ఉంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో సుదీర్ఘ విరామం తర్వాత పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక గ్లింప్స్ బయటకు వచ్చింది. పవన్ యాక్షన్ తో పాటు ఒక డైలాగ్ కూడా ఉంది. పగిలే కొద్ది పదునెక్కుతుంది అంటూ గాజు గ్లాస్ కు సంబంధించిన డైలాగు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సినిమాకు సంబంధం లేకుండా ఈ డైలాగు పెట్టారని.. ఎన్నికల ప్రచారం కోసమేనని కామెంట్స్ ప్రారంభమయ్యాయి. దీనిపై తాజాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ స్పందించారు. ఎవరు ఏ విధంగానైనా ప్రచారం చేసుకోవచ్చని.. కానీ కొన్ని నిబంధనలకు లోబడి ఉండాలని.. కొన్ని రకాల అనుమతులు తీసుకోవాలని చెప్పడంతో కొత్త చర్చకు కారణమవుతోంది. ఇది వివాదం అయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు ఈ డైలాగు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ప్రకంపనలే సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాడ్ కూడా వైరల్ అవుతోంది. రాష్ట్రాన్ని జగన్ సర్కార్ ఎలా దివాలా తీసింది.. దానిని నిలబెట్టే ప్రయత్నంలో జనసేన పాత్ర గురించి స్వల్ప నిడివిగల ఈ యాడ్ నెటిజెన్లను తెగ ఆకట్టుకుంటుంది. దీనిని త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. అటు పొలిటికల్ యాడ్, ఇటు ఉ స్తాద్ భగత్ సింగ్ సినిమా గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి మాత్రం ఆ గ్లింప్స్ ను పరిశీలించాల్సి ఉందని చెప్పడంతో.. ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతాయా? ఇబ్బందులు ఎదురవుతాయా? అన్న ఆందోళనలో జనసైనికులు ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.