YCP High Command: అధికారం దూరమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పార్టీ పరిమితమైంది. ఈ క్రమంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలి. ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలి. ఇదంతా జరగాలంటే పార్టీ నిత్యం జనాల్లో ఉండాలి. అందువల్లే వైసిపి ఇటీవల కాలంలో ఏపీలో ధర్నాలకు, నిరసనలకు పిలుపునిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అది శృతిమించి మొదటికే మోసం తెచ్చేలా ఉంది.
వైసిపి అధిష్టానం ఇటీవల అన్ని జిల్లాల నాయకత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ విధానాలపై బలంగా పోరాడాలని సూచించింది. అయితే ఇది అనంతపురం జిల్లాలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణన్ని తీసుకొచ్చింది . ముఖ్యంగా ఇద్దరు నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. వైసిపి అధిష్టానం పాడుతున్న రాగానికి.. వీరిద్దరూ వేరువేరుగా తాళం వేయడంతో పరిస్థితి మొదటికి వస్తోంది. తద్వారా రచ్చ ఏర్పడి.. కోల్డ్ వార్ కాస్త వైల్డ్ ఫైర్ లాగా మండుతోంది.
అనంతపురం జిల్లాలోని వైసీపీలో విభేదాలు మొదటి నుంచి ఉన్నవే. ఇటీవల కాలంలో అవి తగ్గినట్టు కనిపించినప్పటికీ… మళ్లీ మొదలయ్యాయి. అనంతపురం అర్బన్ లో ఆధిపత్య పోరు తార స్థాయికి చేరుకుంది. ఇక్కడ పార్టీ అధ్యక్షుడిగా అనంత వెంకట్రామిరెడ్డి ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఈయన ఓడిపోయారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే నాయకుడిగా ఈయనకు పేరుంది.. 2024 అనంతపురం అర్బన్ స్థానం కోసం చాలామంది పోటీపడినప్పటికీ అధిష్టానం మాత్రం వెంకట్రామిరెడ్డి వైపు ఆసక్తిని ప్రదర్శించింది. ఇక అప్పటినుంచి వెంకటరామిరెడ్డి చాలామందికి శత్రువుగా మారిపోయారు. వెంకటరామిరెడ్డి తమను రాజకీయంగా తొక్కిస్తున్నాడని కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి వెంకటరామిరెడ్డి మీద ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటరామిరెడ్డి విహార శైలని ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.. తనకు మేయర్ పదవి రాకుండా వెంకటరామిరెడ్డి అడ్డుకున్నారని.. ఎమ్మెల్యే టికెట్స్ టికెట్ రాకుండా తొక్కేశారని ఆయన ఇటీవల అంతరంగీకులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. విజయ భాస్కర్ రెడ్డి వర్గీయులు కూడా ఇదేవిధంగా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచే రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారని విజయభాస్కర్ రెడ్డి వర్గీయులు అంటున్నారు.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం విజయభాస్కర్ రెడ్డి మేయర్ కావాలనుకున్నారు. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ప్రయత్నాలకు వెంకటరామిరెడ్డి అడ్డు పుల్ల వేశారని విజయభాస్కర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఇక అప్పట్నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయాయి.
ఇదే క్రమంలో మెడికల్ కాలేజీల పీపీపీ ల విధానానికి వ్యతిరేకంగా వైసిపి ఉద్యమాన్ని సాగించింది. వెంకటరామిరెడ్డి ఈ కార్యక్రమాన్ని కొద్దిరోజులుగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత అనంతపురం జిల్లా కేంద్రంలో ఈనెల 15న భారీగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కూడా జరిపారు. అయితే ర్యాలీలో విజయభాస్కర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి వర్గీయులకు గొడవ జరిగింది. ముందు మేము వెళ్తామంటే మేము వెళ్తామని నాయకులు గొడవపడ్డారు. ఈ గొడవలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఇన్నాళ్లపాటు జరిగిన కోల్డ్ వార్ కాస్త వైల్డ్ ఫైర్ లాగా మారింది.