YCP: కొన్నిసార్లు మితిమీరిన అభిమానం చేటు తెస్తుంది. అభిమానం పర్వాలేదు గానీ.. మితిమీరిన అభిమానం, స్వామి భక్తి అనేది ఒక్కోసారి వికటించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే జరుగుతోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పై మతపరమైన ముద్ర ఉంది. ఇటువంటి సమయంలో శబరిమలైలో జగన్మోహన్ రెడ్డి బ్యానర్ తో కొంతమంది వైసీపీ అభిమానులు వెళ్తుండడం సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తోంది. వారు తమ అధినేతపై అభిమానంతో ఆ పని చేయవచ్చు కానీ.. ప్రజల్లోకి మరోలా వెళ్తుంది. రాజకీయ ప్రత్యర్థులు సైతం వ్యతిరేక ప్రచారం చేస్తారు. ఒకటి కాదు రెండు కాదు.. ఇటీవల ఇటువంటి ఘటనలు శబరిమలైలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే అధికం అని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేసేదాకా పరిస్థితి వచ్చింది.
* పరమ పవిత్రం..
సాధారణంగా అయ్యప్ప స్వామి దీక్ష ఎంతో కఠినమైనది. భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు కూడా. దక్షిణ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్షాపరులు పెరుగుతున్నారు. 41 రోజులపాటు దీక్ష చేసి శబరిమలైలో విరమణ చేస్తారు. దీక్షలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం అయ్యా.. అప్ప నామస్మరణతోనే ఉంటారు భక్తులు. శబరిమలైలో సైతం అయ్యప్ప శరణు ఘోష వినబడుతుంది తప్ప మరొకటి ఉండదు. భవ బంధాలను విడిచిపెట్టి.. అయ్యప్ప దీక్షలో ఉండే భక్తులు ఎంతో కఠినంగా ఉండాలి. ఆహార నియమ నిబంధనలు పాటించాలి. గృహనివాసాన్ని విడిచిపెట్టి సన్నిధానంలో మెలగాలి. హిందూ పూజలతో పాటు వ్రత కల్పనలో అయ్యప్ప స్వామి ది ప్రత్యేక స్థానం. దేశ ప్రముఖులు సైతం అయ్యప్ప దీక్షలో చాలా కఠినంగా ఉంటారు. మొన్ననే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీక్ష చేపట్టారు. ఎంతో నిష్టతో శబరిమలై వెళ్లారు.
* ఇప్పటికే మతముద్ర..
అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పై( Y S Jagan Mohan Reddy) మతముద్ర ఉంది. ఆయన తిరుమల వస్తే డిక్లరేషన్ ఇవ్వాలన్న డిమాండ్ వరకు పరిస్థితి వచ్చింది. అయితే ఇటువంటి సమయంలోనే శబరిమలైలో జగన్ బ్యానర్ తో.. జగన్ నామస్మరణతో భక్తులు వెళుతుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఇది భక్తి అనే సెంటిమెంట్ తో ముడిపడిన అంశం. ఇది ముదిరిపాకనపడితే జాతీయస్థాయిలో సైతం చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే అయ్యప్ప భక్తులు అనేది ఒక్క ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించిన అంశం కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువమంది అయ్యప్ప దీక్షలో ఉంటారు. అటువంటి వారికి ఆగ్రహం తెప్పించే అంశం అవుతుంది. ఆపై హిందూ సమాజంలో కూడా దీనిపై చర్చ జరుగుతుంది. అందుకే ఒకటికి రెండుసార్లు వైసీపీ శ్రేణులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.